విశాఖపట్నాన్ని ఏనాడో వ్యాపార పరంగా తమ గుప్పట్లోకి తీసేసుకున్నారు కమ్మ సామాజిక వర్గ జనాలు. తెలుగుదేశం హయాంలో రాజకీయంగా కూడా కీ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. విశాఖ మేయర్ గా తమ మనిషి వుండాలని వాళ్లకు ఎప్పటి నుంచో వుంది. కానీ అది సాధ్యం కావడం లేదు. రిజర్వేషన్లలో వైజాగ్ మేయర్ పదవి ఎటో పోతోంది తప్ప, ఈ వర్గానికి అందని ద్రాక్షగా వుంటూ వస్తోంది.
ఈసారి విశాఖ మీద ఎలాగైనా పట్టు సాధించాలని తెలుగుదేశం పట్టుదలగా వుంది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో సిటీ పరిథిలో కాస్త పట్టు నిలబెట్టుకుంది. మరోపక్క విశాఖను తమ ఆధీనంలోకి తీసుకోవాలని వైకాపా నేత విజయ సాయి రెడ్డి గట్టి పట్టుదలతో వున్నారు. మళ్లీ తమ హవా చాటి, రాజధాని కాబోయే చోట తమ పట్టు నిలబెట్టుకోవాలని తెలుగుదేశంలోని కీలక వర్గం ఆలోచిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో విశాఖ మేయర్ పదవిని బిసి జనరల్ కు రిజర్వ్ చేసేసారు. దీంతో ఇక కమ్మ సామాజిక వర్గానికి ఈ పదవి అందకుండా పోయింది. వైకాపాలో బిసి నేతలు గట్టిగానే వున్నారు. పైగా ఉత్తరాంధ్ర లోని కీలకమైన కాపు, వెలమ, కాళింగ, గవర, యాదవ, రెడ్డి (క) అన్నీ బిసి కులాలే. అందువల్ల ఎవరైనా రెడీ కావచ్చు. తెలుగుదేశంలో వున్నవారిలో వేరే ప్రాంత నేతలే ఎక్కువ. వారిలో బిసిలు తక్కువ.
అందువల్ల ముందుగా అభ్యర్థి కోసమే తెలుగుదేశం వేట సాగించాలి. ఎందుకంటే ఇది ఇన్ డైరక్ట్ ఎన్నిక. డబ్బుల ప్రభావం అనివార్యం. మేయర్ కావాలనుకున్న వ్యక్తి కార్పొరేటర్లను ముందుగా రెడీ చేసుకోవాలి. వారికి పెట్టుబడులు పెట్టాలి. సరైన సౌండ్ పార్టీ దొరక్కపోతే పార్టీ పెట్టుబడి పెట్టాల్సిందే.
మొత్తానికి విశాఖలో మేయర్ అభ్యర్థి దగ్గరే తెలుగుదేశం డిఫెన్స్ లో పడేలా చేసినట్లు కనిపిస్తోంది.