అమరావతి ఎజెండా చంద్రబాబుకు చేతనౌతుందా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తమ తెలుగుదేశం పార్టీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. వీరోచితంగా పోరాడాలని, ప్రతిచోటా స్ఫూర్తిదాయక నాయకత్వం ఇవ్వాలని, వైకాపా దాడులు ఎదుర్కోవాలని, అధైర్యం వీడాలని, క్షేత్రస్థాయిలో ప్రజాపోరాటాలు…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తమ తెలుగుదేశం పార్టీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. వీరోచితంగా పోరాడాలని, ప్రతిచోటా స్ఫూర్తిదాయక నాయకత్వం ఇవ్వాలని, వైకాపా దాడులు ఎదుర్కోవాలని, అధైర్యం వీడాలని, క్షేత్రస్థాయిలో ప్రజాపోరాటాలు చేయాలని.. ఆయన పిలుపు ఇచ్చారు. కాకపోతే.. చంద్రబాబునాయుడు మాటల్లో అడుగడుగునా బేలతనం కనిపిస్తున్నదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చంద్రబాబు శనివారం ఉదయం రాష్ట్రంలోని అన్ని మండలాల తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చేసిన తర్వాత.. పార్టీ అధినేత ఈ మాత్రం సమావేశం కూడా నిర్వహించకపోతే.. వారు ఓటమిని ముందే ఒప్పేసుకుని చేతులెత్తేసినట్లుగా ఉంటుంది. చూడబోతే.. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి సమావేశం పెట్టినట్టుగా కనిపిస్తోంది. అంతా బాగున్నది గానీ.. ఆయన మాటల్లో  మాత్రం అడుగడుగునా.. భయం, ఓటమి బెరుకు, నిస్సహాయత తాండవిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లోనే చంద్రబాబు అమరావతి ప్రస్తావన కూడా తెచ్చారు. జగన్ ను నిందించడానికి అమరావతి ప్రజల దీక్షలు తప్ప చంద్రబాబునాయుడుకు మరొకటి గుర్తున్నట్టుగా లేదు. 2800 మందిపై కేసులు పెట్టినా కూడా మహిళలు ధైర్యంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు.

అయితే ఆయన తీరు గమనించిన రాష్ట్ర ప్రజలకు ఒక సందేహం తలెత్తుతోంది. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలనే బలమైన కోరిక చంద్రబాబుకు ఉంటే గనుక.. ఆయన ఈ ఒక్క పాయింట్ మాత్రమే ఎజెండాగా.. స్థానిక ఎన్నికల ఫలితాలకోసం ప్రజల్లోకి వెళ్లగలరా? అనేది ప్రజల సందేహం. అసలు అమరావతి లో మాత్రమే రాజధాని ఉండాలనే కోరిక కేవలం 29 గ్రామపంచాయతీల ప్రజలకు సంబంధించిన సమస్యగా తేలిపోయింది.

నిజానికి ఆ 29 గ్రామాల్లో కూడా ఘంటాపథంగా తెలుగుదేశం వారు మాత్రమే గెలుస్తారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఆ గ్రామాల్లో పచ్చదళాలన్నీ షామియానాలకింద దీక్షలు చేస్తుండగా, ఊర్లలో మిగిలి ఉన్న వాళ్లందరూ అధికార వికేంద్రీకరణకు అనుకూలురే. పోరాటం చేసే వారిది హైప్ అయితే గనుక.. 29 గ్రామాల్లోనూ ఒకటో రెండో వైకాపా హస్తగతం కావచ్చు. అదే సమయంలో..  రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతంలోనూ అమరావతి సెంటిమెంటు లేదు.  కాదు కూడదు.. ఉన్నది అని వాదించదలచుకుంటే.. చంద్రబాబు.. అమరావతి అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలి. అప్పుడు వారికి బుద్ధివచ్చే సంగతి తర్వాత.. ప్రజాభిప్రాయం ఎటు మొగ్గుతున్నదో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది.