ఏపీ కాపు నాయకులు ఇప్పుడు మంచి వేడి మీద ఉన్నారు. చాలా తరచుగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. వారినుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భవిష్య కార్యచరణ ప్రణాళిక బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే వీరి వెనుక ఉన్నది ఎవరు? కాపుల్లోనే కొందరు ప్రముఖ కాపు నాయకులను పూర్తిగా పక్కన పెడుతూ.. పార్టీలతో నిమిత్తం లేకుండా అనేక మంది కాపు నాయకుల్ని సమీకరిస్తూ దఫదఫాలుగా భేటీలు నిర్వహించడం అనే వ్యవహారాన్ని నడిపిస్తున్నది ఎవరు? అనే సందేహం చాలా మందిలో ఉంది.
తాజాగా కాపు ప్రముఖులు విశాఖపట్నంలోని ఒక హోటల్లో సమావేశం అయ్యారు. గంటా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు లనుంచి, తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన రావు, మాజీ డీజీపీ సాంబశివరావు ఇలా అనేకులు ఈ భేటీలో ఉన్నారు. భేటీ తర్వాత.. కాపు కార్పొరేషన్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, కాపులకు అన్యాయం జరుగుతోందని అది చర్చించడానికే కలిశామనం ఏదో డొంకతిరుగుడుగా మీడియాకు వెల్లడించారు.
ఇతర బీసీ ఎస్సీ వర్గాలను కలుపుకుని ఫోరం ఫర్ బెటర్ ఏపీ పేరుతో సంస్థను ఏర్పాటుచేసి పోరాడుతామని కూడా నిర్ణయించారు. కానీ.. వారు బయటకు వెల్లడించిన ఈ వివరాలన్నీ కూడా ఉత్తుత్తివే అని, వీరి కలయికలకు అసలు సూత్రధారులు వేరే అని వినిపిస్తోంది.
కాపు ప్రముఖులు ఇలా కలవడం ఇది తొలిసారి కాదు. గతంలో హైదరాబాదులో కూడా ఒకసారి కలిశారు. భేటీ వివరాలు చాలా గోప్యంగా ఉంచారు గానీ.. సమాచారం బయటకు వచ్చింది. అయితే.. భారతీయ జనతా పార్టీ తెర వెనుక ఉండి.. కాపు ప్రముఖులు అందరినీ సమీకరిస్తున్నట్లుగా పుకార్లు వచ్చాయి. వీరిలో కొందరు భాజపా వైపు మొగ్గుతున్న వారు కూడా ఉన్నారు.
ఇలాంటి నేపథ్యంలో విశాఖలో మళ్లీ సమావేశం కావడం.. ఫోరం ఫర్ బెటర్ ఏపీ అంటూ.. ఇప్పుడున్నదేదో బ్యాడ్ ఏపీ అన్నట్లుగా ఒక కార్యచరణ ప్రకటించడం, భవిష్యత్తులో రాజకీయ మలుపు తీసుకునే అవకాశం ఉన్నదని మాజీ డీజీపీ వెల్లడించడం ఇదంతా అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.
గంటా శ్రీనివాసరావు ఆదిగా.. ఈ భేటీల్లో కలుస్తున్న వారంతా.. వైసీపీయేతర కాపులే. అంతవరకు స్పష్టం. తెలుగుదేశానికి లొంగే అవకాశం లేని వారూ ఇందులో ఉన్నారు. ఈ కోణాల్లో పరిశీలించినప్పుడు.. అచ్చంగా బీజేపీ స్కెచ్ ప్రకారం జరుగుతున్న కాపుల సమీకరణలుగా అనిపిస్తుంది.
ఏపీ రాజకీయాల్లో కాపుల మీద బీజేపీకి చాలా ఆశలే ఉన్నాయి. రెడ్డి, కమ్మ కులాలను అధికార- ప్రతిపక్ష పార్టీలు సొంతం చేసుకోగా.. మిగిలిన కులాల్లో బలమైన కాపులు మొత్తం తమ ఓటుబ్యాంకుగా మార్చుకోవాలనేది వారి వ్యూహం. కాపులకు పార్టీలో చాలా కీలక పదవులే ఇచ్చారు.
పూర్వ, ప్రస్తుత పార్టీ అధ్యక్షులు కూడా కాపులే. కాపు యువత ఆరాధించే పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇతరత్రా కాపులందరినీ కూడా సమీకరించి.. సమీపభవిష్యత్తులో వారందరితో బీజేపీ అనుకూల కార్యచరణతో ముందుకు సాగుతారని తెలుస్తోంది.