జగన్ గారూ.. డప్పుకొట్టుకోవడం ఒక కళ!

‘ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల్రా’ అనేది ప్రాచీన కాలంనుంచి ఉన్న రాజనీతి. అందుకే మనకు రామాయణం, భారతం వంటి గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. చరిత్ర పుస్తకాలు తయారయ్యాయి. విజయం సాధించిన వాళ్లు తమ గురించి…

‘ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల్రా’ అనేది ప్రాచీన కాలంనుంచి ఉన్న రాజనీతి. అందుకే మనకు రామాయణం, భారతం వంటి గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. చరిత్ర పుస్తకాలు తయారయ్యాయి. విజయం సాధించిన వాళ్లు తమ గురించి నలుగురికీ తెలిసేలా చేసుకున్న ప్రయత్నాలే.. చరిత్రగా చెలామణీలో ఉన్న కంటెంట్ అంతా!  ఆధునిక యుగంలో- ఈ ప్రాచీన రాజనీతి కొత్తపుంతలు తొక్కుతోంది. 

ప్రజాస్వామ్యం పుణ్యమాని ‘విజయం’ అనేది అయిదేళ్లకోసారి  చేతులు మారే అవకాశం ఉన్నందున- అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచిపని చేసినా ఎప్పటికప్పుడు డప్పు కొట్టుకోవడం చాలా అవసరం! ఈ పద్ధతి దశాబ్దాలుగా అందరూ అనుసరిస్తున్నదే. తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. తమ డప్పు తామే కొట్టుకుంటోంది. పెద్ద పెద్ద జాకెట్ యాడ్ లతో పత్రికలను ముంచెత్తేస్తూ కోట్లకు కోట్ల రూపాయలను తగలేస్తోంది. 

‘డప్పు కొట్టుకోవడం’ వరకు బాగానే ఉంది- కానీ ఏ విషయానికి ఎక్కడ డప్పు కొడుతున్నారు? అలా డప్పు కొట్టుకోవడంలో ఔచిత్య భంగం ఏమైనా జరుగుతున్నదా? ఏ రంగంలో ఆడవలసిన ఆట ఆ రంగంలోనే ఆడాలి! రంగంభంగం జరిగితే శృంగభంగం తప్పుదు. ఆ విషయాల్ని అవలోకిస్తూ గ్రేటాంధ్ర అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం!

‘అడవిలో ఉప్పు దొరకదు- అక్కడ ఉప్పు అమ్మితే లాభం. సముద్రపు ఒడ్డున చింతపండు అమ్మితే లాభం. ఈ రెండూ దొరకని పట్టణాల్లో రెండూ కలిపి ఊరగాయ అమ్మితే లాభం’.. చాలా సింపుల్ వ్యాపార సూత్రం ఇది! పెళ్లిపుస్తకం సినిమాలో ముళ్లపూడి వారు రాసిన డైలాగు ఇది. ఇది కేవలం వ్యాపార సూత్రం మాత్రమే కాదు.. విజయసూత్రం! ఒక విషయం రాణించాలంటే.. సందర్భ ఔచిత్యం, స్థల ఔచిత్యం రెండూ కూడా చాలా ముఖ్యం. మనం ఆ విషయాన్ని ఏ సందర్భంలో చెబుతున్నాం అనేది ఎంత ముఖ్యమో, ఏ వేదిక మీదినుంచి చెబుతున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. మనం చెప్పదలచుకున్నది ఎవరికి అందుతోంది.. అనే విషయాన్ని సదా గమనంలో ఉంచుకున్నప్పుడే.. దాని ఫలితం దక్కుతుంది.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయానికే వస్తే.. ఆయన డప్పు కొట్టుకోడానికి చాలా విషయాలే ఉంటున్నాయి. కానీ ప్రభుత్వానికి డప్పు కొట్టుకునే ముచ్చట మాత్రం కొన్ని విషయాల్లోనే కనిపిస్తూ ఉంటుంది. పైగా పత్రికల్లో ప్రకటనల ద్వారా ఆ డప్పుకొట్టుకునే ముచ్చట తీర్చుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నాల ద్వారా.. వారికి ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతున్నాయా? వారు చెప్పదలచుకుంటున్నది.. చెప్పదలచుకున్న వారికి చేరుతోందా? అనేది పెద్ద సందేహం! ఆ విషయంలో ప్రభుత్వం విఫలం అవుతోంది.

‘టార్గెట్’ మిస్..

ప్రచురణ, ప్రకటనల తదితర రంగాల్లో ‘టార్గెట్ ఆడియెన్స్’ అనే ఒక వర్గం ఉంటుంది. ఎవరికోసం మనం ఏం చెబుతున్నాం? అనేది ముఖ్యం. ఉప్పు చింతపండు సామెత లాగా.. రెక్కాడితే డొక్కాడని పేద, కింది తరగతి వాళ్లతో ఓ బహిరంగ సభ పెట్టి.. రాజ్యాంగంలో రావాల్సిన మార్పులు, ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకుంటే పేదల జీవితాల్లో వెలుగు వస్తుంది.. అని నోబెల్ బహుమతి స్థాయి మేధావుల ప్రసంగం అందిస్తే ఏమవుతుంది? ఆ ప్రసంగం వాళ్లకు అర్థమవుతుందా? ఫలితం ఉంటుందా? దాన్నే మనం ‘ఔచిత్య భంగం’ అంటాం! టార్గెట్ మిస్సయిన ప్రకటనల కిందికి వస్తుంది. 

జగన్ ప్రభుత్వం చేస్తున్న చాలా విషయాలు, పత్రికల్లో ప్రచురిస్తున్న ప్రకటనలు మనకు ఇలాంటి అభిప్రాయం కలిగిస్తాయి. ఒక్క ఉదాహరణ చెప్పుకుని దాని ద్వారా పరిస్థితిని విశ్లేషించుకుందాం. 

ఆటోడ్రైవర్లకు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆయన ఏం చేసినా సరే.. ఒక్క బటన్ నొక్కడం ద్వారా వేల, లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము బదిలీ చేసేస్తుంటారు. ఇలా సొమ్ము ఇవ్వడం వలన ఆటో డ్రైవర్ల జీవితాలకు ఒక ఆర్థిక భరోసా ఏర్పడుతుందని, ఆర్థిక స్థిరత్వం ఉంటుందనేది ప్రభుత్వం వాదన. అది నిజమే అనుకుందాం. కానీ.. ఇలా ఆటో డ్రైవర్లకు ఇస్తున్నాను అనే సంగతిని ప్రచారం చేసుకోవడం అవసం అని ప్రభుత్వం కోరిక. ఆ ప్రచారం రూపేణా ఏం చేస్తున్నారు. అన్ని ప్రధాన పత్రికల్లో కోట్లకు కోట్ల రూపాయల ఖర్చుతో ఫుల్ పేజీ మరియు జాకెట్ యాడ్స్ ఇస్తున్నారు. 

నిజానికి జగన్ ఇలాంటి పని చేస్తున్నారని తెలియాల్సింది ఎవరికి? ఆటోడ్రైవర్లకా? ఇతరులకా? వాస్తవంగా చెప్పాలంటే.. ఆటోడ్రైవర్ల వర్గం, వారి కుటుంబాలకు తెలిస్తే సరిపోతుంది. మరి ఇలాంటి ప్రకటన అగ్రశ్రేణి ఆంగ్ల దినపపత్రికగా క్లెయిం చేసుకునే వారికి ఇస్తే.. వారికి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ సొమ్ము ముట్టజెబితే జగన్ ప్రభుత్వం ఆ ప్రకటన ద్వారా ఆశించే ప్రయోజనం నెరవేరుతుందా? సదరు ఆంగ్ల దినపత్రికలు చదివే పాఠకులు ఎవరు? ఆటో డ్రైవర్లకు సొమ్ము పంచే పథకం పట్ల వారికి ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? ఆ ప్రకటన వలన ప్రభుత్వం పట్ల వారిలో ఎంత గౌరవం పెరుగుతుంది? అలాంటి పని చేయడం, అలాంటి పత్రికలో యాడ్ ఇవ్వడం వలన కొత్తగా ఎంత ఓట్ బ్యాంక్ తయారవుతుంది? ఇలాంటి సమీక్ష ప్రభుత్వం ఎన్నడైనా చేసుకుంటున్నదా?

లాభం కంటె.. నష్టం జాస్తి..

జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం సాగించే కూటములకు లెక్కేలేదు. తెలుగుదేశం ప్రేరేపిత, సౌజన్యంతో నడిచే స్పాన్సర్డ్ దుష్ప్రచారాలు కూడా తటస్థుల రూపంలో పుష్కలంగా సాగుతూనే ఉన్నాయి! తటస్థుల రూపేణా వినిపించే ప్రధాన విమర్శలు ఇలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి.. రకరకాల వర్గాల వారికి సర్కారు సొమ్ము పంచిపెట్టేస్తున్నారు. పన్నులు కట్టే వాళ్ల ద్వారా వచ్చే డబ్బును.. పనీపాటా చేని వారందరికీ ఎడాపెడా దోచిపెట్టేస్తున్నారు! ఏ వర్గం వారైనా సంపాదించుకునే మార్గాలను సృష్టించాలి తప్ప.. నేరుగా బ్యాంకు ఖాతాలకు డబ్బు పంచేయడం కరెక్టు కాదు.. అనే విమర్శలే ఎక్కువ. 

ఇలాంటి సంఘోద్ధారక ప్రచారాలు చాలా ఆసక్తికరంగా.. అనేక మందికి నచ్చుతుంటాయి కూడా. మేధావులం అనుకునే వారు, తటస్థులం అనుకునే వారు.. అన్నిటినీ మించి.. ఇలాంటి ఏ పథకం కిందికీ రాకుండా, ప్రభుత్వం నుంచి తమకు వ్యక్తిగతంగా దక్కే ఆర్థిక ప్రయోజనం లేకుండా ఉండే ఎగువమధ్యతరగతి, సంపన్న హోదాలకు చెందిన వారంతా ఈ ప్రచారాన్ని ఇష్టపడతారు!

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ అగ్రశ్రేణి తెలుగు దినపత్రికలు, ఇంగ్లీషు పత్రికలు చదివే బాపతు పాఠకులు ఎవరు? దిగువ మధ్యతరగతి వారు ఎవరైనా వీటిని కొని చదువుతున్నారా? వారంతా మధ్యతరగతి శ్రేణికి చెందిన వారు. ప్రకటన చూసిన ప్రతిసారీ.. ‘జగన్ ఇంతే.. మన నుంచి వసూలు చేసే సొమ్ముల్ని తన ఇష్ట ప్రకారం పంచిపెట్టేస్తుంటాడు’ అని తిట్టుకుంటూ తిరిగేవాళ్లే. అదే విషయం సామాన్యులకు, పేదవారికి రీచ్ అయితే.. ’జగన్ పేదోళ్లందరికీ అండగా ఉంటున్నాడు.. మనకు కూడా ఏదో ఒక నాటికి ఏదో ఒక రీతిగా అండగా నిలుస్తాడు’ అని అనుకుంటారు. అలాంటి ఫలితం రాబట్టడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. 

ఉదాహరణలో చెప్పుకున్న ఆటోవాళ్ల ప్రకటన విషయమే చర్చించుకుంటే.. ప్రభుత్వచేయూత పొందుతున్న ప్రతి ఆటో మీద.. ఒక పోస్టరు వేయిస్తే సరిపోతుంది. ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అవుతుంది. అన్నింటికంటె మించి.. పత్రికలకు తగలేసే కోట్ల రూపాయలకంటె చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఔచిత్యం ప్రభుత్వానికి ఎప్పటికి అర్థమవుతుంది?

ఏ డప్పు కొట్టాలో తెలియకపోవడం నేరం!

నిజానికి ప్రభుత్వం అన్నాక అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటుంది. కేవలం డబ్బు పంపిణీలు మాత్రమే కాదు. విధాన పరంగా ప్రభుత్వం తీసుకునే గొప్ప నిర్ణయాలూ ఉంటాయి. సమతుల రాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టే నిర్ణయాలూ ఉంటాయి. ఉన్నాయి. పత్రికలు చదివే వర్గం ఆలోచనపరులు, చదువరులు అయి ఉంటారు గనుక.. డబ్బు వితరణల గురించి కాకుండా.. ఇలాంటి విధాన పరమైన ప్రభుత్వ సుపరిపాలన గురించి ఆ పత్రికలలో ప్రకటనలు ఇస్తే ఎలా ఉంటుంది. ఏ వేదిక మీద.. ఏ డప్పు కొట్టాలో సరిగ్గా తెలుసుకోవడం అంటే ఇదే!

ఉదాహరణకు రాష్ట్రప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఇక్కడ పెట్టుబడులకు ఆకర్షించడానికి కొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అద్భుతమైన అవకాశాలను వారికి ఇస్తుంటుంది. అలాంటి విషయం.. ఇంగ్లిషు దినపత్రికలో యాడ్ రూపంలో వస్తే.. చదివిన వారు కూడా.. రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో చాలా ప్రయత్నం చేస్తోంది.. ఫలితం అనేది తర్వాతి సంగతి అని అనుకుంటారు. ప్రభుత్వం ప్రజలకు దోచిపెట్టేస్తోంది అని తిట్టుకోకుండా ఉంటారు. 

నిజానికి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రతిపక్షాలు అనేక విషయాల్లో కుట్రలు చేస్తుంటాయి. ప్రభుత్వానికి చేతకావడం లేదని అంటూ.. రోడ్లు బాగా లేవని, పట్టించుకోవడం లేదని చాలా చెడ్డ ప్రచారం చేస్తుంటారు. నిజానికి ప్రభుత్వం రోడ్లకు కేటాయిస్తున్న మొత్తాలు, జరుగుతున్న పనులు కూడా చాలానే ఉంటున్నాయి. ఆ విషయం ఎవరికి తెలుస్తోంది. కేటాయింపులు అన్నీ కాగితాల మీద ఉండగా, పనులు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుండగా.. పని జరిగిన ప్రాంతంలో తప్ప.. మిగిలిన రాష్ట్రానికి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తున్న సంగతి ఎలా అర్థమవుతుంది? నిజానికి ఇలాంటి విషయాల గురించే పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి!

ఆర్టికల్ లాగా ఎందుకు రాయించరు?

సంక్షేమ పథకాలు, డబ్బు పంచిపెట్టే పథకాలకు సంబంధించి ఫుల్ పేజీ, జాకెట్ యాడ్స్ ఇవ్వడం దండగ. దాని బదులుగా.. లబ్ధిదారుల అభిప్రాయాలను తెలియజెప్పేలాగా.. వారి స్పందన తెలిపేలాగా.. చిన్న చిన్న ఆర్టికల్స్ ను పత్రికల్లో వచ్చేలా చేయడం కొంత ఫలితం ఇస్తుంది. తటస్థులు చదివినా కూడా.. ‘జగన్ డబ్బు పంచి పెట్టేస్తున్నాడు’ అనుకోకుండా.. ‘జగన్ జీవితాలను నిలబెడుతున్నాడు’ అని భావిస్తారు! పత్రికలకు ఇతర విషయాల్లో ప్రకటనలు ఇస్తూ.. ఇలాంటి వార్తలను ప్రచురించి తీరాలని ముడిపెట్టాలి. తాము ఇచ్చే వార్తలను ప్రచురించే పత్రికలకు మాత్రమే ప్రకటనలు కూడా ఇస్తాం అని అప్రకటిత నిబంధన పెట్టడం కూడా తప్పేం కాదు. 

ఎలక్షన్ సమయంలో పత్రికలు ఎగబడి పెయిడ్ ఆర్టికల్స్ వేస్తుంటాయి. ‘అడ్వర్టైజ్ మెంట్’ అనే మాట కూడా చెప్పకుండా.. అధికారికంగానే డబ్బు తీసుకుంటూ పెద్దపెద్ద ఆర్టికల్స్ వేస్తుంటాయి. ఎటూ పత్రికల్లో విలువలు పతనమైపోవడం ఎన్నడో జరిగిపోయింది. కాకపోతే.. ప్రభుత్వానికి సరైన మార్గంలో ప్రచారానికి వాడుకుంటే ఎక్కువ లబ్ధి జరుగుతుంది. 

పచ్చమీడియా, జగన్ వ్యతిరేక ప్రచారాన్ని ఉద్యమంలాగా సాగిస్తున్న మీడియా వీళ్లంతా కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల కోట్ల రూపాయలను మాత్రం ఆశిస్తుంటారు. కనీసం ప్రభుత్వం చేసే మంచి పనులు గురించి ఒక్క ముక్కయినా రాయడానికి ఇష్టపడరు. ఇలాంటి వారితో పెయిడ్ ఆర్టికల్స్ లాంటివి రాయించేలా ముడిపెట్టి.. అవి రాస్తే మాత్రమే ప్రకటనలు ఇచ్చేలా ప్రభుత్వం పూనిక వహించాలి. 

అంతిమంగా చూసినప్పుడు.. ప్రభుత్వం అనేక రకాల మంచి పనులు చేస్తుంటుంది. పేదలకు సొమ్ము పంపకాల దగ్గరినుంచి విధాన నిర్ణయాల వరకు అందులో అనేకం ఉంటాయి. అయితే, ఏ వర్గం ప్రజల్లో ఎలాంటి పనులు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తాయో.. చెక్ చేసుకుంటూ ఉండాలి. పత్రికలు చదివే మధ్యతరగతి వారికి ఎలాంటి ప్రచారం అందాలనే విచక్షణ లేకుండా ఖర్చు పెట్టి.. వారిలో నెగటివిటీని పెంచుకోవడం వలన ఏంటి లాభం. 

మంచి పనులు చేయడం మాత్రమే కాదు.. వాటి గురించి డప్పు కొట్టుకోవడం కూడా ముఖ్యం!

డప్పు కొట్టుకోవడం మాత్రమే కాదు.. ఎక్కడ ఏ డప్పు కొట్టాలో తెలసుకోవడం ఇంకా ముఖ్యం!!. అందుకే.. డప్పు కొట్టుకోవడం ఒక కళ!

.. ఎల్ . విజయలక్ష్మి