ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణకు వచ్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం కావడంలో పెద్ద విశేషమేమీ లేదు. ఆయన బతుకుతెరువు అది! రాజకీయ పార్టీలను కలవడమూ.. వారిని విజయపథంలో నడిపించడానికి తన వద్ద ఉన్న వ్యూహాలను అమ్ముకోవడమూ.. కోట్లుగడించడమూ అనేది ఆయన వ్యాపారం. అందుకే వచ్చి కలవడంలో వింత లేదు.
కేసీఆర్ విషయానికి వస్తే.. ఇంటికి తొలిసారి వచ్చిన అతిథులందరికీ మనం ఇల్లంతా తిప్పి గదిగదినీ ప్రత్యేకంగా చూపించినట్లుగా.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ లను సందర్శించి రమ్మని పీకేను పంపడం కూడా విశేషమేమీ కాదు.
కాకపోతే.. పీకే మరియు కేసీఆర్ ల భేటీ అనేది ఎనిమిదిగంటల పాటు సుదీర్ఘంగా సాగడమే చాలా చిత్రంగా కనిపిస్తోంది. కేసీఆర్ కోసం మన తెలుగు పీకే గంటల కొద్దీ నిరీక్షించడం మనం చూశాం గానీ.. కేసీఆర్తో ఈ బీహారీ పీకే ఏకంగా గంటలకు గంటలు కూర్చుని చర్చలు జరిపితే ఆశ్చర్యం అనిపించకుండా ఎలా ఉంటుంది?
పీకేతో కేసీఆర్ భేటీ కీలక ప్రాధాన్యం పూర్తిగా జాతీయ రాజకీయాలకు సంబంధించినది అనే అంచనా చాలా మందిలో ఉంది. అదే సమయంలో ప్రశాంత్ కిశోర్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున దూతగా కేసీఆర్ వద్దకు వచ్చారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అలా కాకపోతే.. మమతా బెనర్జీతో తన తరఫున దౌత్యంనెరపడానికి కేసీఆర్ ఆయనను ఆశ్రయించి ఉంటారని కూడా కొందరు భావిస్తున్నారు.
కేసీఆర్ తలపెడుతున్న ప్రాంతీయ పార్టీల మూడో కూటమి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు చాలా కీలకం. ఈ చిన్న పార్టీలు రాజ్యంచేస్తున్న రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లున్న నాయకుల్లో ఆమె కూడా ఒకరు. అదే సమయంలో.. కేంద్రంలోని నరేంద్రమోడీ మీద కేసీఆర్ ను మించి విరుచుకుపడిపోయే నాయకురాలు ఆమె ఒక్కరే. అయితే.. మూడో కూటమికి ఆమె కీలకమే గానీ.. ఆమె కేసీఆర్ ను ఎంత మేరకు విశ్వాసంలోకి తీసుకుంటుంది? కేసీఆర్ మాటకు ఎంత విలువ ఇస్తుంది? అనేది మాత్రం సందేహాస్పదం.
ఇదివరకు కూడా మమతతో భేటీలద్వారా కేసీఆర్ చేయదలచుకున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే మమతతో చాలా సాన్నిహిత్యం ఉన్న, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆమె గెలవడానికి పనిచేసిన పీకేను కేసీఆర్ ఆశ్రయించి ఉండవచ్చుననే అభిప్రాయం వినిపిస్తోంది.
తెలంగాణలో తాను చేయించిన సర్వేల ఫలితాలను, వాటి నమూనాలను కూడా కేసీఆర్ పీకేతో షేర్ చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. నిజానికి కేసీఆర్ సర్వేలకోసం ప్రశాంత్ కిశోర్ మీద ఆధారపడతారో లేదో గానీ.. జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో మంతనాలు జరపడానికి మాత్రం.. ఆయనను ఖచ్చితంగా, ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంది.
తొలిరోజుల్లో మోడీని గద్దె ఎక్కించడం ద్వారా మాత్రమే పాపులర్ అయిన పీకే, ఇప్పుడు మోడీ వ్యతిరేకతతో ఉడికిపోతున్నారు. మోడీని కూల్చడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అదే ఎజెండాతో చెలరేగుతున్న కేసీఆర్ తో పీకే జత కలిస్తే.. చాలా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిమీదకు తీసుకురావడానికి ఈ కలయిక ఉపయోగపడుతుంది. అదే జరిగితే.. మోడీకి ఇక దబిడిదిబిడేనా అని పలువురు అంచనా వేస్తున్నారు.