2018లో అతి భయంకరంగా ఫ్లాప్ అయిన తన సిల్వర్ జూబ్లీ మూవీ అజ్ఞాతవాసితో ఇక సినిమాలు ఆపేశాను అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇక పూర్తి సమయం ప్రజలకే అంకితం అని కూడా సెలవిచ్పారు. అయితే ఆయన చేస్తున్న అంతటి త్యాగాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేదు.
ఎన్నికల్లో కూడా దారుణంగా రెండు నియోజకవర్గాల్లోనూ ఆయనను అట్టర్ ఫ్లాప్ చేశారు! రాజకీయాల్లోకి వెళితే అక్కడ సంపాదన సరిపోతుందనే ఉద్దేశంతో, సినిమాలు ఆపేస్తున్నట్టు ప్రకటించాడో ఏమోగానీ.. ప్రజలు తిరస్కరించే సరికి పవన్ కల్యాణ్ తిరిగి సినిమాలవైపు వచ్చారు. ‘ఇక చేయను’ అని చెప్పిన పాత మాటలు మరచిపోయి, సినిమాలు చేసుకోకపోతే నేను బతకడం ఎలా..? సినిమా నా బతుకుతెరువు అని దీనంగా పలికారు.
ప్రజలు కూడా ‘సర్లెద్దూ’ అనుకున్నారు. కాబోయే సీఎం నేనే అని ప్రకటించుకున్న ఆయన రాజకీయ అత్యాశలను 2019 ఎన్నికలు సమూలంగా చిదిమేసిన తర్వాత.. మళ్లీ మేకప్ వేసుకున్న తర్వాత.. ఇప్పటికి రెండే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి వకీల్ సాబ్! రెండోది భీమ్లా నాయక్!!
ఈ రెండూ కూడా రీమేక్ చిత్రాలే. పింక్, అయ్యప్పనుం కోషియుం చిత్రాలను తెలుగులోకి రీమిక్స్ చేశారు. ఈ రెండూ కూడా.. వాటి వాటి ఒరిజినల్ సినిమాల రూపంలో చాలా కీర్తి పొందిన చిత్రాలు. కానీ.. అమితాబ్ ఎంత స్టార్ అయినప్పటికీ, పవర్ స్టార్ కంటె గొప్పవాడు కాదు కదా..! కనుక ‘పింక్’లో యథేచ్ఛగానూ.. ‘అయ్యప్పనుం..’లో పరిమితంగానూ మార్పుచేర్పుల రూపంలో చేయి చేసుకున్నారు. ఈ రెండు చిత్రాల్లో జరిగిన మార్పులను గమనిస్తే.. ఒక ఏకరూపత- సిమిలారిటీ మనకు కనిపిస్తుంది. అదే. ‘పవన్ కల్యాణ్ ఏ పాత్ర అయితే చేయదలచుకున్నాడో.. ఆ పాత్రను దీనజనోద్ధారకుడిగా ప్రొజెక్టు చేయడం!
పింక్ అనేది చాలా సున్నితమైన భావోద్వేగాల మేళవింపుగా సాగిపోయే చిత్రం. ఈ చిత్రంలో అమితాబ్ పాత్రను మలచిన తీరు కూడా అద్భుతమైన రీతిలో ఉంటుంది. కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉండగా.. అమితాబ్ పాత్ర లోప్రొఫైల్ లో ఉంటూ వారికి సపోర్టింగ్ కేరక్టర్ లాగా మాత్రమే ఉంటుంది. మరి పవన్ కల్యాణ్ అలాంటి పాత్ర చేయగలడా? అసాధ్యం. అందుకే కొన్ని మార్పులు చేశారు.
హీరోయిక్ ఎలిమెంట్స్ ఆ కథ పరిధిని దాటకుండా కలిపినా సరిపోయేది. కానీ పవన్ కల్యాణ్ ఒక ‘దీనజనోద్ధారకుడు’ అనే బిల్డప్ కోసం చాలా కృతకమైన ఫ్లాష్ బ్యాక్ ను కలిపారు. ఆ కలపడం ద్వారా.. స్మూత్ గా ఉండే పింక్ లోని భావోద్వేగాల ఎమోషనల్ మ్యాజిక్ ను గంగలో కలిపారు.
అయప్పనుం.. విషయంలో కూడా అదే జరిగింది. మాతృక విషయానికి వస్తే అది ఇద్దరు వ్యక్తుల ఈగోల మధ్య పోరాటం. ఇద్దరిలో ఉండేదీ అహంకారమే. వ్యక్తుల అహంకారాల మధ్య సమరం.. ఎంతటి పరిణామాలకు దారితీస్తుందనే సున్నితమైన కథ అది. దాన్ని కాస్తా పవన్ కల్యాణ్ చేస్తుండే సరికి.. ఇద్దరి అహంకారాల స్థానే ఒకరిది అహంకారమూ, మరొకరదిది ఆత్మగౌరవమూ అన్నట్టుగా మార్చేశారు.
సహజంగానే.. ఆత్మగౌరవం వాటా పవన్ కు దక్కింది. అంతటితో ఆగలేదు. ఆ పాత్రను మళ్లీ ‘దీనజనోద్ధారక’ బిల్డప్ తో తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు. అడవిబిడ్డలందరినీ కాపాడే దేవుడిగా, ట్రైబల్స్ కు ఆయనే దేవుడిగా.. ఆయన విలన్లను కొట్టిన రోజే వారికి పండగరోజుగా.. ఇన్ని అసహ్యమైన ఎగస్ట్రా బిల్డప్ లు ఇచ్చారు. మాతృకలో ఉండే హృద్యమైన ఎమోషనల్ ప్లే మంటగలిసిపోయింది.
సినిమా బాగానే వచ్చింది గనుక.. ఇలాంటి మార్పుల గురించిన విమర్శలు రాలేదు. కానీ.. పొలిటికల్ ఫెయిల్యూర్ తర్వాత.. కమ్ బ్యాక్ మూవీ సిరీస్ లో వచ్చిన ఈ రెండింటిలోనూ.. పవన్ కల్యాణ్ తన పాత్రను.. ‘దీనజనోద్ధారక’ టాగ్లైన్ తగిలించేలాగా బలవంతంగా తయారు చేయిస్తున్నాడని అనిపిస్తుంది.
ఇదే తరహా దీనజనోద్ధారక, పేద, పీపుల్స్ వార్ బిల్డప్ లతో 2008లో ఆయన జల్సా వంటి సినిమా చేసి, 2009 ఎన్నికల్లో అన్న పార్టీకి మద్దతుగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసినా సాధించింది సున్నా! ఆ సంగతి గుర్తు తెచ్చుకుంటే.. సినిమాలో ఇచ్చే బిల్డప్ లను నమ్మి ప్రజలు ఓట్లు వేయరని, వారి దృష్టిలో సినిమాకు రాజకీయానికి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంటుందని.. వాటిని విడివిడిగా చూస్తారని పవన్ కల్యాణ్ కు అర్థమవుతుంది.
దానివలన.. కొత్త కథలను నమ్మే సత్తాలేక.. ఎటూ రీమేక్ ల మీదనే డిపెండ్ అవుతున్న పవన్ కల్యాణ్ ముందు ముందు ఇలాంటి దీనజనోద్ధారక బిల్డప్ లు కృతకంగా జోడించకుండా.. సినిమాను సినిమాలాగానే చేస్తే.. మరిన్ని మంచి హిట్ లు సాధిస్తారు.