కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు రెండున్నర లక్షల స్థాయికి చేరాయి. మే నెలాఖరుకు రోజువారీ కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రోత్ రేటు తగ్గడం మొదలై వారం గడిచిపోయింది.
గ్రోత్ రేటు తగ్గడంతో రోజువారీ కేసుల సంఖ్య రోజువారీగా తగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక దశలో దేశంలో 37 లక్షలకు చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య గత వారం రోజుల్లోనే ఏడు లక్షల వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 29 లక్షల స్థాయిలో ఉంది.
ప్రత్యేకించి సెకెండ్ లో అల్లాడిన మహారాష్ట్ర, ఢిల్లీల్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కర్ణాటకలో కూడా రోజువారీగా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. రాబోయే నెల రోజుల్లో అయినా సెకెండ్ వేవ్ నుంచి దేశానికి ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
అయితే.. కరోనా కేసుల సంఖ్య తగ్గినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇక వ్యాక్సినేషన్ ఒత్తిడి పతాక స్థాయికి చేరేలా ఉంది. ఇప్పటికే ఒక డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్న వారు రెండో డోస్ కోసం, అసలు ఒక డోస్ వ్యాక్సిన్ కూడా అందని వారు.. తమ పరిస్థితి ఏమిటంటూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేసే స్థితికి వెళ్లిపోతున్నారు.
కరోనా సెకెండ్ వేవ్ లో గ్రామాల్లోకి పాకిపోయింది. మూడు నాలుగు వందల జనాభా ఉన్న గ్రామాల్లో కూడా కరోనా కారణ మరణాలు నమోదయిన పరిస్థితి సెకెండ్ వేవ్ లో కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో కరోనా అంటే ఇప్పుడు జనాలు హడలిపోతున్నారు. పల్లెల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనాను జయించే విషయంలో కొంత ధీమాగా ఉండొచ్చని పల్లె ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు అందిస్తారు? అంటూ ప్రభుత్వాల పోకడలను ప్రజలు గమనిస్తున్నారు.
అయితే వ్యాక్సినేషన్ మాత్రం పూర్తి మందగమనంలో సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వ్యవహారం కావడంతో.. మోడీ వైపు గుడ్లురిమి చూస్తున్నారు సామాన్య ప్రజానీకం. తమకు ఎరుకలోని వారికే చాలా మందికి కరోనా రావడం, వారు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉండటంతో.. ఇప్పటి వరకూ ఈ వైరస్ బారిన పడిన వారు, వ్యాక్సిన్ కోసం చూస్తున్న ఎదురుచూపులు అలాంటిలాంటివి కావు.
మూడో వేవ్ భయాలు ప్రజల్లో గట్టిగా ఉన్నాయి. ఈ వేవ్ నుంచి బయటపడుతున్న వారిలో కూడా ఆ ఆనందం కన్నా, మళ్లీ వేవ్ వస్తుందనే భయాలే ఎక్కువగా డ్యామినేట్ చేస్తున్నాయి. మూడో వేవ్ లోపు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కూడా వైద్య రంగ నిపుణులు గట్టిగా చెబుతున్నారు.
మరోవైపు ఇప్పటికీ రోజుకు 20 లక్షల డోసుల స్థాయిలోనే వ్యాక్సినేషన్ జరుగుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇలా అయితే.. దేశం మొత్తం వ్యాక్సినేషన్ జరగడానికి మినిమం రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు. మోడీకి హనీమూన్ పిరియడ్ పూర్తిగా ముగిసిపోయిందని వ్యాక్సినేషన్ ఉదంతం ఆయనకు అత్యంత కఠిన పరీక్ష కానున్నదని స్పష్టం అవుతోంది.
ఇప్పటి వరకూ మోడీ నాయకత్వ సమర్థత అంతా మాటలకే పరిమితం అయ్యింది, ఉత్తరాది సంగతేమో కానీ, దక్షిణాదిన పల్లెజనాలు కూడా ప్రధానిని తిట్టుకుంటున్నారు! మాటలు తప్ప చేతల్లేవనే.. బలమైన అభిప్రాయం మోడీ మీద ఇక్కడి ప్రజల్లో ఏర్పడుతూ ఉంది. మీడియా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ను ప్రస్తావిస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్ కు మొత్తం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామంటూ ఇప్పటికే మోడీ ప్రభుత్వం ప్రకటన చేసింది. అందుకు కట్టుబడకపోతే మాత్రం, మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగానూ కార్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.