నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై రాష్ట్ర ఆయుష్‌శాఖ తేల్చేసింది. ఎవరి “ఆనందం” వారిదే అని ప్రకటించింది. దీంతో మందు వాడకంపై నెలకున్న ఉత్కంఠకు తెరపడినట్టైంది.
కరోనా సెకెండ్ వేవ్‌తో వణికిపోతున్న ప్రజానీకానికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు ఆశాకిరణంలా కనిపిస్తోంది. దీంతో ఈ మందు శాస్త్రీయతపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆయుష్ శాఖ కమిషనర్ కర్నల్ రాములు నేతృత్వంలో వైద్య బృందం నెల్లూరు జిల్లాలో పర్యటించింది. ఆనందయ్య తయారు చేస్తున్న మందులను పరిశీలించింది. పర్యటనకు ముందు హైదరాబాద్ ల్యాబ్‌లో మందు నమూనాలను పరీక్ష చేయించారు.
నెల్లూరు జిల్లాలో పర్యటన, ఆనందయ్య మందుపై అధ్యయనం, వాటి ఫలితాలు, హైదరాబాద్ ల్యాబ్ ఫలితాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత , అంతిమంగా దాన్ని ఒక నాటు మందుగా తేల్చేశారు. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందులో హానికారక పదార్థాలు లేవని కర్నల్ రాములు తేల్చి చెప్పారు.
కానీ దీన్ని ఆయుర్వేద మందుగా మాత్రం పరిగణించట్లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మందు వాడకంపై ఎవరిష్టం వారిదని ఆయన చెప్పారు. మందు వాడకంలో ఎవరికి వారు విచక్షణతో ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించడం గమనార్హం.
ఇదిలా ఉండగా కర్నల్ బృందం రెండురోజుల పాటు నెల్లూరు పర్యటించింది. ఈ సందర్భంగా మందు కోసం వచ్చిన వారి అభిప్రాయాలు సేకరించింది. అలాగే ఆనందయ్య మందు వాడిన వారి వివరాలు కూడా తెలుసుకుంది. మందు వినియోగించిన వారు తమకు ఆరోగ్యం మెరుగైనట్టు చెప్పారు.