అవునవును చంద్రబాబు పచ్చి నిజాలే చెబుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘం కమిషనర్ కావడానికి ఆమెకున్న అర్హతలేంటి? ఆమె ఏమైనా మన కులమా? పార్టీనా? ప‌్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే వరకూ ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిసో, తెలియకో ఏపీ మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి పదవిని నీలం సాహ్ని అనే మహిళకు కట్టబెట్టి అవమానించారు( టీడీపీ దృష్టిలో). పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్లీ సలహాదారు పదవితో రెండో సారి అవమానించారు. అంతటితో ఆయన ఆగితే వైఎస్ జగన్ ఎందుకవుతారు? ముచ్చటగా మూడోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని నియమించి తనది మూర్ఖపు ప్రభుత్వమని నిరూపించుకున్నారు.
కీలకమైన రాజ్యాంగ పదవిలో ఎవరిని కూచోపెట్టాలనే స్పృహే వైఎస్ జగన్‌లో కొరవడింది. తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు నుంచి వైఎస్ జగన్ ఏమి నేర్చుకున్నట్టు? ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను చక్కగా రాజ్యాంగ పదవిలో కొలువుతీర్చారు. ఊరికే నిమ్మగడ్డను పట్టుకుని అదీ, ఇదీ అని వైఎస్ జగన్ పొగుడుతారే కానీ, తాను మాత్రం ఆ పని ఎందుకు చేయలేదు?
నీలం సాహ్నిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు విన్న ఓ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు పైన పేర్కొన్నట్టు ప్రశ్నలు సంధిస్తున్నాడు. చంద్రబాబు ఏమన్నారో ముందుగా తెలుసుకుందాం.
‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఆ పదవిలో ఒక్క నిమిషం కొనసాగేందుకూ అర్హత లేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఇదే తనోడిని ఎస్ఈసీగా నియమించుకోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై పడి అసలుకే ఎసరు వస్తుందని గ్రహించిన చంద్రబాబు ..నిమ్మగడ్డను ఆ ఊసే ఎత్తొద్దని ఆదేశించారు. బాస్ ఆదేశాలను నిమ్మగడ్డ పాటించారు. రాజ్యాంగ పదవిలో ‘మనోడిని’ నియమించుకుంటే కలిగే వెసులుబాటును చంద్రబాబు ప్రత్యక్షంగా చూపినా, జగన్ మాత్రం అది పాటించలేదు.
అసలు ఎస్ఈసీకి కావాల్సిన అధికారిక అర్హతల సంగతిని కాసేపు పక్కన పెడదాం. ఎస్ఈసీకి కావాల్సిన అనధికారిక అర్హతల విషయమై సోషల్ మీడియాలో రెండు రోజులుగా పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఇవి ఏపీ ఎస్ఈసీకి ప్రత్యేకం. అవేంటో తెలుసుకుందాం.
వైఎస్ జగన్ అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలి. ఏపీ ఎస్ఈసీగా చంద్రబాబు సామాజిక వర్గానికి రిజర్వ్ చేస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లను రిజర్వ్ చేస్తున్నప్పుడు, ఎస్ఈసీ పదవి మాత్రం ఏం పాపం చేసింది.
అలాగే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారై , సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేలా ప్రవర్తించాలి. ఇంగ్లీష్, తెలుగు భాషలు రావాల్సిన అవసరం లేదు. అసలు మాటలే రాకపోతే మరీ మంచిది. చంద్రబాబు మనసెరిగి నడుచుకునే జ్ఞానం తప్పనిసరి. పైకి కనిపించే బట్టలు ఏ కలర్‌లో ఉన్నా ఇబ్బంది లేదు, మనసు మాత్రం పసుపమయమై ఉండాలి.
స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించాలనే నిబంధన వర్తించదు. చంద్రబాబు ప్రయోజనాలే ప్రాధాన్యతగా నడుచుకోవాలి. ఐఏఎస్ కాదు, అయ్యా …ఎస్ అనేదే అర్హత కొలమానం. అసలు రాజ్యాంగ పదవులు చంద్రబాబు జన్మహక్కు. అలాంటప్పుడు ఎవరీ నీలం సాహ్ని? అంతా నాన్‌సెన్స్.
ఈ అర్హతలతో నియమితులైన వారికి ఇతరత్రా రాజ్యాంగ వ్యవస్థల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురుకావు. నియామకానికి సంబంధించి వ్యాజ్యాలు వేయకుండా చూసుకునే పూచీ చంద్రబాబుదే. కావున నీలం సాహ్నిని తక్షణం తొలగించి నెటిజన్లు పేర్కొన్న అర్హతలున్న వ్యక్తిని ఎస్ఈసీగా నియమించాల్సిన గురుతర బాధ్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఉంది. అయ్యా వైఎస్ జగన్‌రెడ్డి గారూ …అర్థమవుతోందా?
సొదుం రమణ