ఉమ్మడి ఏపీ చరిత్రను పరిశీలించినా, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులను గమనించినా.. ప్రతిపక్ష పార్టీ ఇంత అచేతనంగా ఉన్న సందర్భాలు మరేవీ కనిపించవు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన మూలాల్లోనే ఉనికిని కోల్పోతూ ఉంది.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రెండు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటి వరకూ కార్యక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ కనిపించకపోవడం గమనార్హం. టీడీపీ తన ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోలేదు. దశాబ్దాలుగా కాంగ్రెస్ వ్యతిరేకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ ప్రతిరూపంగా చూస్తూ.. తెలుగుదేశం పార్టీకే సానుకూలంగా ఉన్నారు. వారి శాతం ఎప్పుడూ ఎంతో కొంత ఉంటుంది.
ఇటీవలి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో కూడా 30 శాతం ఓట్లను పొందింది తెలుగుదేశం. ఈ ముప్పై శాతానికి ఎప్పుడూ లోటు ఉండదని స్పష్టం అవుతూ ఉంది. అయితే.. అది ఎందుకూ పనికి రాదు అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
అధికారం చేతిలో ఉన్నప్పుడు పప్పుబెల్లాలు పంచి అయినా చంద్రబాబు నాయుడు దాన్ని 40 శాతం వరకూ తీసుకెళ్లారు. అయితే అధికారం చేతిలో లేకపోతే, తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత, పొత్తులు లేకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు కథ అంతే! ఆ 30 శాతానికి మించి ఓట్లను సంపాదించేంత శక్తి చంద్రబాబుకు సొంతంగా లేదు. ఆ ముప్పై శాతం కూడా రకరకాల సమీకరణాల ఆధారంగా పడతాయి.
రాయలసీమ ప్రాంతంలో కొన్ని సామాజికవర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయి. దశాబ్దాల రాజకీయ పరిణామాలు ఆ సామాజికవర్గాలను టీడీపీకి అనుకూలంగా మార్చాయి. అలాంటి ఓట్లు ఇప్పుడు కూడా టీడీపీకి పడుతూ ఉంటాయి. చంద్రబాబు నాయుడే ఆ సామాజికవర్గాలను కొట్టితిట్టి పంపించినా, వారు టీడీపీకే ఓటేస్తారు. చంద్రబాబే కాదు.. మరెవరు ఆ నాయకత్వ స్థానంలో ఉన్నా.. ఆ ఓట్లు సైకిల్ కే పడతాయి. వాటికి తోడు.. కమ్మ సామాజికవర్గం సానుకూలత టీడీపీని 30 శాతం ఓటు బ్యాంకు పార్టీగా నిలుపుతూ ఉంది.
సాధారణంగా ఏ రాఫ్ట్రానికి వెళ్లిన అక్కడి ప్రధాన పార్టీలకు ఎంతో కొంత పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండనే ఉంటుంది. రెండు ప్రధాన పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో వాటికి చెరో ముప్పై శాతం స్టాండర్డ్ ఓటు బ్యాంకు ఉంటుంది. మిగతా ఓట్లు రాజకీయ పరిస్థితులను బట్టి అటూ ఇటూ అవుతూ ఉంటాయి. అధికారం, ప్రభుత్వ వ్యతిరేకత, పొత్తులు వంటివి మిగతా ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తాయి.
ఇప్పుడు టీడీపీకి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే.. జగన్ ప్రభుత్వంపై ఇంతెత్తు వ్యతిరేకత లేదు! అలాగే ఇప్పుడు పొత్తులు పెట్టుకుని చంద్రబాబును ఆదుకునే వాళ్లు కూడా ఇంకా ఎవరూ కనిపించడం లేదు!
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. పదేళ్ల కాంగ్రెస్ పాలన పై ప్రబలిన వ్యతిరేకత ప్రభావం జగన్ మీద పడటం, జగన్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటూ టీడీపీ గట్టిగా ప్రచారం చేయడం, ఆ పై మోడీ వేవ్ టీడీపీకి కలిసి రావడం, పవన్ కల్యాణ్ మద్దతు.. ఇవే ప్రధాన కారణాలు. 30 శాతంగా ఉన్న టీడీపీ స్టాండర్డ్ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత, మోడీ వేవ్, పవన్ కల్యాణ్ మద్దతు కలిసి.. 43 శాతానికి తీసుకెళ్లాయి.
అక్కడకూ జగన్ పార్టీ ఆ ప్రతికూలతల మధ్యన కూడా.. టీడీపీ, బీజేపీలు జాయింటుగా సాధించిన ఓటు బ్యాంకు కన్నా కేవలం అర శాతం తక్కువలో నిలిచింది! చంద్రబాబు గెలిచినప్పుడు పొత్తులు, అప్పటి వరకూ ఏలిన ప్రభుత్వ వ్యతిరేకత ప్రధానమైన అంశాలు. అది కూడా పదేళ్ల కాంగ్రెస్ పాలన అనంతరమే మోడీ, పవన్ ల మద్దతుతో చంద్రబాబు నాయుడు బోటాబోటీగా ఎక్కువ ఓట్లను పొంది అధికారాన్ని పొందారు.
అప్పటికి రాజకీయ అనుభవం తక్కువగా ఉండటంతో జగన్ చేసిన పొరపాట్లు కూడా ఉండనే ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే.. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా మెప్పు పొందకపోవచ్చు గాక, సామాన్యుల్లో మాత్రం జగన్ ఇమేజ్ ప్రబలం అవుతోంది. సంక్షేమ పథకాలతో జగన్ సామాన్యులకు చాలా చేరువ అవుతున్నారు. అది కూడా చెబితే చేస్తాడు, మాట తప్పడు, మాట మార్చడు.. అనే విశ్వసనీయతను జగన్ సంపాదించుకోగలిగాడు.
చంద్రబాబు ఇమేజ్ ఇందుకు పూరి విరుద్ధం! అధికారంలో ఉన్నా, లేకపోయినా చంద్రబాబును కన్నింగ్ అనే భావిస్తారు ఏపీ జనాలు. మాట మార్చడం, వెన్నుపోట్లు పొడవడం చంద్రబాబుకు కరతలామలకం అని ఏపీ ప్రజల్లో చాలా బలమైన ఫీలింగ్ ఉండనే ఉంది. గత తరం దాన్నే రాజకీయం అంటూ ఆమోదించింది కానీ, ఈ తరహా రాజకీయం ఇప్పుడు నడిచేలా లేదు. చంద్రబాబు, లోకేష్ లేమో అదే రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు ఇంకా!