వివాహబంధం పదిలంగా ఉండాలంటే ఏం చేయాలి? వైవాహిక జీవితం మరింత ఆనందమయం కావాలి అంటే.. ఏం కావాలి? అంటే నయా పరిశోధకులు ఒకే మాట చెబుతున్నారు. ఆనందకరమైన శృంగార జీవితం అనేది ఈ ప్రశ్నలకు ఒకే సమాధానం.
ఈ తరహా ఆన్సర్ వింటే కొంతమంది ఆశ్చర్యపోతారేమో కానీ.. మహిళ వ్యూ నుంచి ఒక డేటింగ్ సైట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నారు అధ్యయనకర్తలు. శృంగార జీవితంలో సంతృప్తి చాలా మంది మహిళల్లో వైవాహిక జీవితం పట్ల గాఢతను పెంచుతుందని, వారి వైపు నుంచి వివాహబంధం మరింత పదిలం అవుతుందని ఈ అధ్యయనం చెబుతూ ఉంది.
డేటింగ్ సైట్ల వరకూ వెళ్లే మహిళలే కాదు.. చాలా మంది గృహిణులు కూడా కోరుకునే వాటిల్లో సంతృప్తికరమైన శృంగార జీవితం కూడా ముఖ్యమైనది అని వేరే చెప్పనక్కర్లేదు. వైవాహిక జీవితంలో ప్రభావితం చేసే అంశాలెన్నో ఉంటాయి.
ఆర్థికరమైన ఇబ్బందులు లేకపోవడం, పరస్పరం నమ్మకం, పరస్పరం ఇచ్చుకునే గౌరవం, కుటుంబీకుల మధ్యన సత్సంబంధాలు, పిల్లలు… సాఫీగా ఉండే పరిస్థితులు.. ఇవన్నీ వివాహబంధాలను ప్రభావితం చేసే అంశాలే. అయితే వీటన్నింటితో పాటు.. పురుషుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడని అంశం, చాలా శ్రద్ధ వహించాల్సిన అంశం శృంగారం అని నవీన మహిళల నుంచి వ్యక్తం అవుతున్న అభిప్రాయాలను బట్టి స్పష్టం అవుతోంది.
పెళ్లిలో శృంగారం ఒక డ్యూటీలా నిరంతరం కొనసాగుతూ ఉండవచ్చు. ఇలా కొనసాగితే మంచిదే అంటున్నారు అధ్యయనకర్తలు. అలా జరగని పరిస్థితులను మాత్రం సృష్టించుకోవద్దని వారు చెబుతున్నారు. ఈ సలహాలన్నీ పురుషులకే అని వారు నొక్కి చెబుతున్నారు. బెడ్ రూమ్ లో భార్య అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం చాలా కీలకమైన అంశమని చెబుతున్నారు.
శృంగారానికి సంబంధించి తమ అసంతృప్తులను చాలా మంది భార్యలు భర్తకు చెప్పలేకపోవచ్చు. దానికి అనేక కారణాలూ ఉండవచ్చు. పురుషాధిపత్యం, ఆర్థికంగా ఆధారపడి ఉండటం, సామాజికంగా దక్కే గౌరవం భర్తతోనే ముడిపడి ఉండటం.. ఇవన్నీ కూడా అసంతృప్తికరమైన శృంగార జీవితం విషయంలో కూడా మగువ భర్త దగ్గర కూడా పెదవి విప్పని పరిస్థితి ఉండవచ్చు. అయితే పరిస్థితి ఏమిటనేది గ్రహించాల్సిన అవసరం మగాడిది కూడా అని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
తమతో స్పందించిన చాలా మంది మహిళలు హ్యాపీ సెక్స్ లైఫ్ ను కోరుకుంటున్నారని, అది కూడా భర్తతోనే అయితే మేలని వారు చెప్పారట. ఈ విషయంలో అధ్యయనకర్తలు ఎక్కడ నుంచి మొదలు పెడుతున్నారంటే.. భార్యకు ఆకర్షణీయంగా కనపడటంతో మొదలుపెడితే, ఫోర్ ప్లే వరకూ చాలా అంశాలున్నాయి.
ఇంట్లోనే ఉండే భార్యకు అవే పాత బట్టలతో, అందం గురించి పెద్దగా మెయింటెయినెన్స్ చేయకుండా కనిపించడం భర్త గొప్పదనం ఏమీ కాదని అంటున్నారు అధ్యయనకర్తలు. ఎంత భార్య అయినప్పటికీ.. వయసుతో నిమిత్తం లేకుండా ఆకర్షణీయమైన బట్టలేసుకుని కనిపించడం అవసరం. ఫిజిక్ కూడా చక్కగా మెయింటెయిన్ చేయాల్సిన అవసరం మగాడికి కూడా ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఒక శృంగారం విషయానికి వస్తే.. కేవలం తన సుఖాన్ని చూసుకుని అదే శృంగారం అనుకోవడం పొరపాటని అధ్యయనకర్తలు విడమరిచి చెబుతున్నారు. ఫోర్ ప్లే కీలకమని, శృంగారాన్ని రొటీన్ గా మార్చడం కూడదని, భార్యకు కొత్త తరహా శృంగారనుభవాలను ఇవ్వడంపై మైండ్ కు పని చెప్పాలని ఈ అధ్యయనకర్తలు చెబుతున్నారు. సెక్స్ కచ్చితంగా వివాహబంధాన్ని పదిలపరచడంలో కీలకమైనదని వారు ఇస్తున్న ముక్తాయింపు.