క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం నాయకత్వానికీ, ప్రజలకూ పూర్తి గ్యాప్ వచ్చింది. రాజకీయ నేతలు రెండేళ్ల పాటు జనం మధ్యకు వెళ్లకపోతే వారిని ప్రజలు సులువుగా మరిచిపోతారు. తెలుగుదేశం పార్టీ కి గతంలో కంచుకోటలుగా నిలిచిన నియోజకవర్గాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంది.
తెలుగుదేశం నేతలు కరోనాకు ముందు కూడా జనం మధ్యకు వచ్చింది లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వారు పూర్తిగా మొహం చాటేశారు. 2014 నుంచి 19ల మధ్యన పచ్చచొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరి జేబూ నిండింది. ఎన్నికల్లో ఖర్చులు కూడా తెలుగుదేశం నేతలకు పెద్ద లెక్క కాలేదు. ఆఖరుకు పోలింగ్ కు ముందు రోజు పంచిన పసుపు-కుంకుమ సొమ్ములు కూడా టీడీపీని గట్టెక్కించలేకపోయాయి.
ఇక అప్పటికే బోలెడన్ని అవినీతి కార్యకలాపాల్లో భాగస్తులు కావడంతో ఎమ్మెల్యే స్థాయి నేతలు జనం ముందుకు వస్తే ఏ తలనొప్పులు వస్తాయో అన్నట్టుగా కామ్ అయిపోయారు. సాధారణంగా అధికార పార్టీ నేతలు ఇళ్లకు పరిమితం కావడం, ప్రతిపక్ష పార్టీ నేతలు జనంలోకి వెళ్లడం వంటివి చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏపీలో నియోజకవర్గ స్థాయిల్లో పరిస్థితిని గమనిస్తే.. ప్రతిపక్ష పార్టీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల కన్నా అధికార పార్టీ నేతలే ఎక్కువగా ప్రజల్లో కనిపిస్తూ ఉంటారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నియోజవకర్గ కేంద్రాల్లో అందుబాటులో ఉంటున్నారు కానీ పచ్చ పార్టీ నేతలు కిమ్మనడం లేదు! దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని.. కొందరు మున్సిపల్ ఎన్నికల సమయంలో క్యాడర్ మధ్యకు వెళ్లారు. అధికార పార్టీకి సవాళ్లు విసిరారు. అయితే అలాంటి వారికి కూడా మున్సిపల్ ఎన్నికల్లో షాక్ కొట్టే ఫలితాలు ఎదురయ్యాయి. టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన నేతలు కూడా కనీసం ఒక్క మున్సిపాలిటీ వార్డును గెలిపించుకోవడం గగనం అయ్యింది!
ఇక టీడీపీ క్యాడర్ కు కూడా పరిస్థితి నెమ్మదిగా అర్థం అవుతూ వచ్చింది. వారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం మంచిదన్న లెక్కలేయడంలో పెద్ద విడ్డూరమూ లేదు. కాస్త ఆర్థిక, అంగబలం ఉన్న వారు ఎలాగోలా నియోజకవర్గ స్థాయిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి క్రమక్రమంగా దగ్గరవుతూ ఉన్నారు.
టీడీపీని నమ్ముకుంటే ఇక కష్టమే అనే భావన ఈ వర్గాల్లో వచ్చింది. వీళ్లు కూడా టీడీపీ నాయకత్వానికి క్రమంగా దూరం అయిపోతున్నారు. నేతలేమో ప్రజల మధ్యకు వెళ్లడం మానేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందో, ఆరు నెలల ముందో జనం మధ్యకు వెళితే చాలని లెక్కేసినట్టుగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ లేమో ఏపీలోనే లేరు.
ఏపీకి చుట్టాలయ్యారు. అదే తీరును ఫాలో అవుతూ మాజీ ఎమ్మెల్యేలు, పచ్చ పార్టీ నేతలు.. అసలు ఏపీలో ప్రతిపక్ష పార్టీ లేదనే భావనను రెండేళ్లలోనే కలిగించారు. మరి రానున్న రోజుల్లో కూడా పచ్చపార్టీ రాజకీయం ఇలాగే సాగితే.. ఎన్నికల ముందే మళ్లీ జనం మధ్యకు వెళితే.. ప్రజలు ఎగేసుకుని అధికారాన్ని అప్పగించేస్తారా?