ఉక్కు తీర్మానం అంత షాక్ ఇచ్చిందా… ?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కారాదు అంటూ ఏపీ అసెంబ్లీ తాజాగా తీర్మానం చేసింది. నిజంగా కేంద్రానికి ఇది షాక్ అని చెప్పాలి. ప్రైవేటీకరణ‌ చేసి తీరుతామని కేంద్రం చెబుతున్న నేపధ్యంలో ఇలాంటి…

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కారాదు అంటూ ఏపీ అసెంబ్లీ తాజాగా తీర్మానం చేసింది. నిజంగా కేంద్రానికి ఇది షాక్ అని చెప్పాలి. ప్రైవేటీకరణ‌ చేసి తీరుతామని కేంద్రం చెబుతున్న నేపధ్యంలో ఇలాంటి తీర్మానం రావడం ఇబ్బందిని కలిగించాలి.

కానీ ఈ షాక్ రెండవ వైపు కూడా గట్టిగానే తగిలింది అంటున్నారు. విశాఖ ఉక్కు విషయంలో తీర్మానం చేయాలి అని అడిగింది తెలుగుదేశం పార్టీ. తీరా తీర్మానం చేసే వేళకు బహిష్కరణ పేరుతో వారు సభకే వెళ్ళని పరిస్థితి. దీంతో క్రెడిట్ మొత్తం వైసీపీకే వెళ్ళిపోయింది.

మరి విశాఖ  కార్పోరేషన్ ఎన్నికల నుంచి ఉక్కు సెగను రాజేస్తూ వస్తున్న టీడీపీ నేతలకు మంటగా ఉండదా. అందుకే అసెంబ్లీ తీర్మానాన్ని పట్టుకుని దొంగ తీర్మానం అంటున్నారు. ప్రజలను ఇలాంటి వాటితో మభ్యపెడతరా అంటూ ఏకంగా పెదబాబు, చినబాబు గర్జిస్తున్నారు.

విశాఖ ఉక్కు విషయంలో చిత్తశుద్ధి తమకే ఉందని చంద్రబాబు చెప్పుకున్నారు. దమ్ముంటే కేంద్రాన్ని నిలదీయాలని కూడా లోకేష్ బాబు అంటున్నారు. మరి తీర్మానం చేసింది ఎవరి మీదనో తెలియదా అని వైసీపీ నుంచి వస్తున్న కౌంటర్. 

ఇక పార్లమెంట్ లో వైసీపీ గొంతు విప్పలేదని కూడా లోకేష్ అంటున్నారు. దానికీ ఆ పార్టీ నుంచి సమాధానం ఉంది. స్వయంగా రాజ్యసభలో విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా  సీతారామన్ ని ఈ విషయంలో నిలదీశారని చెబుతున్నారు.

ఇక లోక్ సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయ‌ణ కూడా ప్రశ్నించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే అఖిలపక్షంతో వచ్చి కలుస్తామని సీఎం జగన్ చెప్పాక కూడా టీడీపీ విమర్శించడం రాజకీయమే అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి ఉక్కు తీర్మానం టీడీపీకి గట్టి షాక్ ఇచ్చేసిందా అన్న చర్చ అయితే సాగుతోంది.