వ్యాక్సీన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు మొదట్నించీ దాని చిత్తానికి తగినట్లే వుంటున్నాయి. కేవలం రెండు వ్యాక్సీన్ సంస్థలకు మాత్రమే ముందుగా అనుమతి ఇచ్చారు. కోవాక్సీన్ కు చకచకా అనుమతులు లభించడం, క్లినికల్ ట్రయిల్స్ విషయంలో వెసులు బాట్లు లభించడం లాంటి వ్యవహారాలు ఎన్నో వున్నాయి. ఆ తరువాత వ్యాక్సీన్లకు రకరకాల రేట్లు నిర్ణయించడం, కోటాలు నిర్ణయించడం వంటి చిత్రమైన వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.
అలాంటి టైమ్ లో జగన్ ప్రభుత్వం ఉచిత టీకా అంటూ ప్రకటించాక, కేంద్రం కూడా అదే వ్యవహారానికి పచ్చ జెండా ఊపింది. అడుగుతున్నా వేరే కంపెనీలకు అనుమతి ఇవ్వకపోవడంతో దేశంలో వ్యాక్సీన్ లకు విపరీతమైన కొరత ఏర్పడింది. దాంతో వ్యాక్సీన్ కు వ్యాక్సీన్ కు మధ్య కాలాన్ని ఇష్టం వచ్చినట్లు పొడిగిస్తూ పోతున్నారు.
మరోపక్క ప్రయివేటు ఆసుపత్రులకు వ్యాక్సీన్ చేరుతోంది. సర్టిఫికెట్ అక్కరేదు అనుకున్నవారికి వ్యాక్సీన్ అన్నది ఎలా అందుతోందో తెలియదు కానీ అందుతోంది. ఆసుపత్రుల నుంచి వస్తోందో తెలియడం లేదు, కానీ హైదరాబాద్ లో చాలా మంది ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు వ్యాక్సీన్ అందుతోంది.
అదే సమయంలో ప్రభుత్వాలు వ్యాక్సీన్ లు వేయలేక కిందా మీదా అవుతుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దేశంలో అవకాశం వున్న సంస్థలు అన్నింట్లో కోవాక్జీన్ తయారు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సిఎమ్ కేజ్రీవాల్ కోరారు.
టీకాల కొరత వేధిస్తున్న సమయంలో ప్రయివేటు ఆసుపత్రుల్లో వ్యాక్సీన్ లు అన్న నిర్ణయం సరికాదని ఆంధ్ర సిఎమ్ జగన్ కోరారు. ప్రయివేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సీన్ ను ఇవ్వడం వల్ల బ్లాక్ మార్కెట్ కు, ఇష్టం వచ్చిన రేట్లకు దారితీయడానికి అవకాశం ఇస్తుందని జగన్ క్లియర్ గా చెప్పేసారు. ఈ మేరకు మోడీకి ఆయన లేఖ రాసారు. ప్రయివేటు ఆసుపత్రులు తమ చిత్తానికి వ్యాక్సీన్ రేట్లు వసూలు చేస్తున్నాయన్నారు.
నిజానికి ఇది ఆలోచించాల్సిన విషయమే. అసలు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఉచితంగా వ్యాక్సీన్ లు దశలవారీగా ఇవ్వాలని అనుకున్నపుడు ఇక ప్రయివేటు ఆసుపత్రులకు కేటాయించాల్సిన అవసరం ఏమిటి? నెలకు ప్రతి వ్యాక్సీన్ సంస్థ చేసే ఉత్పత్తిని రాష్ట్రాలకు సమానంగా కేంద్రమే పంపేసే చర్యలు చేపట్టవచ్చు. ఆ మేరకు కచ్చితంగా రాష్ట్రాలు బిల్లులు పే చేసేలా కేంద్రం ఆదేశించవచ్చు.
ఇప్పటికైనా కేంద్రం టోటల్ గా వ్యాక్సినేషన్ పాలసీని రివైవ్ చేయాల్సి వుంది. ఇప్పటికి రెండు వ్యాక్సీలు ఇండియాలో తయారవుతున్నాయి. మరో వ్యాక్సీన్ స్పుత్నిక్ కూడా ఇండియాలోకి ప్రవేశించినట్లే. ఈ మూడింటిని సమన్వయం చేయడం, అవసరం అయితే మరి కొన్ని వ్యాక్సీన్లకు అనుమతి ఇవ్వడం, దేశంలో వీలయినంత ఎక్కువ వ్యాక్సీన్ ఉత్పత్తిని పెంచడం వంటి విషయాలను దృష్టిలో పెంచుకుని ఆ పాలసీని డిజైన్ చేయాలి.
ఇప్పటికే కరోనా రెండో దశ విషయంలో మోడీ దారుణంగా ఫెయిల్ అయినట్లు దేశంలో మెజారిటీ జనాలు నమ్ముతున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ విదించకుండా ఆలస్యం చేయడం ద్వారా మోడీ అప్రతిష్ట పాలయ్యారు. ఇప్పుడు వ్యాక్సీన్ పాలసీ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మోడీ తన ప్రతిష్ట ను తిరిగి సంపాదిచుకోవచ్చు. ఆ ధిశగా మోడీ ఆలోచించాల్సి వుంది.