దేశంలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత, కొంతవిరామంతో రాజకీయ పార్టీలను కొత్త పరీక్షలకు గురి చేసే ఎన్నికలు బిహార్ అసెంబ్లీ ఎన్నికలు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరిగిన వెంటనే రాజస్తాన్, మహారాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి.
జనాలు లోక్ సభ ఎన్నికల మూడ్ నుంచి పూర్తిగా బయటకు రాకమునుపే ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అవి పూర్తైన దాదాపు ఏడాదికి బిహార్ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ షెడ్యూల్ ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి బిహార్ ఎన్నికలు తొలి ఛాలెంజ్ లాంటివి!
గతంలో ఈ చాలెంజ్ ను తీసుకుని ఓడిన వాళ్లలో రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ లాంటి వారున్నారు. 2009 లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన బిహార్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలను ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు రాహుల్ గాంధీ.
అప్పట్లో రాహుల్ ప్రధాని కావాలనే డిమాండ్ కాంగ్రెస్ నుంచి మొదలైంది. ఆ పరిస్థితుల్లో బిహార్ లో పార్టీని గెలిపించి సత్తా చాటాలని రాహుల్ ఉబలాటపడ్డాడు. అయితే ఆయన ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. రాహుల్ కు రాజకీయంగా తగిలిన తొలి ఎదరుదెబ్బ అది!
ఆ తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన మోడీకి బిహారీలు షాక్ ఇచ్చారు. 2015లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తయ్యింది. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూలు కలిసి పోటీ చేశాయి.
బిహార్ లో పార్టీని గెలిపించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు మోడీ. బిహార్ బాగు కోసం ఆర్థిక ప్యాకేజీ అంటూ.. ఎన్నికల ప్రచార సభలో ఆయన వేలం పాట పాడారు. బిహార్ కు ఎన్ని వేల కోట్లు కావాలంటూ.. మోడీ వేలం పాట పాడి లక్షల కోట్ల ప్యాకేజీ అనౌన్స్ చేశారు. ఆ ప్రచారం పూర్తిగా ప్రహసనం అయ్యింది. బిహార్ ఎన్నికల్లో బీజేపీ చిత్తయ్యింది.
అంతకు ముందు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టంగట్టిన బిహారీలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని చిత్తు చేశారు. ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో అయితే.. బిహార్ లో బీజేపీ కూటమి స్వీప్ చేసింది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలు సంచలన విజయాలను సాధించాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి చిత్తయ్యింది. కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీట్లో గెలిస్తే, ఆర్జేడీ లోక్ సభలో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది!
అలాగని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలే వస్తాయని చెప్పడానికి లేదు. లోక్ సభలో బిహార్ నుంచి ఆరు ఎంపీ సీట్లను కలిగిన ఎల్జేపీకి బిహార్ అసెంబ్లీలో ఉన్న సీటు ఒక్కటంటే ఒక్కటి! గత రెండు పర్యాయాలుగా.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పరస్పర విరుద్ధమైన ఫలితాలను ఇస్తున్నారు బిహారీలు.
ఈ సారి బీజేపీ, జేడీయూలు కూటమిగా వెళ్తున్నాయి. ఎల్జేపీ సోలోగా పోటీ చేస్తూ ఉన్నా.. అదంతా బీజేపీ వ్యూహ ప్రకారమే అనే అభిప్రాయాలున్నాయి. దళితుల ఓట్లను చీల్చడానికి ఎల్జేపీ సోలోగా పోటీ చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ లు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి తమ లక్ ను పరీక్షించుకుంటున్నాయి.
ఏకంగా 30 లక్షల మందికిపైగా వలస కూలీలను కలిగిన రాష్ట్రం బిహార్. కరోనా పరిస్థితుల్లో బాగా ఇబ్బంది పడిన వర్గం అది. ఇలాంటి నేపథ్యంలో కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుకు కూడా బిహార్ ఎన్నికలు ఒక పరీక్ష లాంటివి కాబోతున్నాయి.