ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న కొత్తలో… ఇకపై తమ పార్టీ రాష్ట్ర శాఖలో ప్రక్షాళన జరుగుతుందని గొప్పలు చెప్పారు. తీరా రోజులు గడిచేకొద్ది, గత బీజేపీ అధ్యక్షులే నయం అనే టాక్ వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో ఆయన మాటలు వింటుంటే తన పార్టీలో చంద్రబాబు మనుషుల ట్రాప్‌లో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో అధికారంలోకి రావడం అటుంచి, తమ ప్రత్యర్థి ఏ పార్టీనో తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఏపీ బీజేపీ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
అధికార వైసీపీ ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వైపు చూడదు. ఎందుకంటే వైసీపీకి మైనార్టీలైన క్రిస్టియన్లు, ముస్లింలు, దళితులు బలమైన అండ. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు బీజేపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉత్పన్నం కాదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని దెబ్బ కొడితే తప్ప, ఏపీలో బీజేపీ బలపడే అవకాశమే లేదు. ఈ వాస్తవాన్ని ఇప్పటికీ బీజేపీ గ్రహించినట్టు లేదు.
ఒకవేళ ఆ వాస్తవాన్ని గ్రహించినా, బీజేపీలో టీడీపీ కోవర్టు నేతలు ఎక్కడికక్కడ టీడీపీని దెబ్బ తీసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో టీడీపీ కోవర్టు నేతల ప్రభావం ఎంతగా ఉందో తాజాగా సోము వీర్రాజు హెచ్చరికలు ప్రతిబింబిస్తున్నాయి.
కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోవడాన్ని ప్రస్తావించినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరిగే విషయాలు షెకావత్‌కు తెలియదన్న భ్రమలో ప్రభుత్వం ఉందా అని ఆయన నిలదీశారు.
ఏపీ బీజేపీలో వుంటూ, టీడీపీతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తుండడం వల్లే పార్టీ బలపడలేదనే పచ్చి నిజం షెకావత్‌కు తెలుసా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముందు ఆ విషయాలు తెలుసుకుని పార్టీని చక్కదిద్దుకునే చర్యలు తీసుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు. ఏపీకి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ద్రోహం ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.