తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య జరిగిన గొడవని వైసీపీకి అంటగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బడా నాయకులు.
పవన్ కల్యాణ్ ఏకంగా ప్రెస్ నోట్ విడుదల చేసి పోలీసులపై విరుచుకుపడగా.. జనసేన కంటే ఓవర్ గా రియాక్ట్ అయ్యారు బీజేపీ నేతలు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేరుగా శ్రీకాళహస్తి వెళ్లి మరీ జనసేన నేతల్ని ఓదార్చి వచ్చారు. పనిలోపనిగా వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
వాస్తవానికి శ్రీకాళహస్తిలో గొడవ జరిగింది ఇద్దరు జనసేన నేతల మధ్యే. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జి నగరం వినుత, శివ అనే జనసేన కార్యకర్తలు ఇద్దరూ గతంలో వైసీపీలో పనిచేశారు.
ఆ తర్వాత జనసేనలోకి వచ్చారు. అయితే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ టికెట్ కోసం శివ, వినుతతో కలసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ లాక్ డౌన్ టైమ్ లో నిత్యావసరాలు పంచారు.
ఇటీవల కాలంలో నగరం వినుత, ఆమె భర్తతో శివకు విభేదాలు రావడంతో గొడవలు జరిగాయి. వినుత ఇంటిపై దాడి చేసిన శివ ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయారు.
టికెట్ ఆశ పెట్టి తనని మోసం చేశారని అతడు వాపోయాడు. అయితే శివ అనే వ్యక్తి గతంలో వైసీపీ కార్యకర్త అని.. జనసేన బురదను వైసీపీపై రుద్దాలని చూశారు. జనసేనకు తోడు బీజేపీ కూడా ఈ బురదలో దిగింది. వ్యక్తిగత వివాదాన్ని పార్టీకి రుద్దాలని ప్రయత్నిస్తోంది.
వీరందరి టార్గెట్ ఒక్కటే. తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో హడావిడి చేయడం. శ్రీకాళహస్తి నియోజకవర్గం తిరుపతి లోక్ సభ పరిధిలోకి రావడంతో… జనసేన, బీజేపీ నాయకుల డ్రామా డోస్ మరింత ఎక్కువైంది. జనసైనికులపై దాడులు జరుగుతున్నాయంటూ కట్టుకథలల్లుతున్నారు.
దుబ్బాక గెలుపుతో ఓవర్ స్పీడ్ లో ఉన్న బీజేపీ చిక్కిందే ఛాన్స్ అంటూ కాళహస్తిలో వాలిపోయింది. వైసీపీ తరపున దివంగత నేత బల్లి దుర్గా ప్రసాద్ కొడుక్కి టికెట్ ఇవ్వట్లేదని తెలిసే సరికి బీజేపీలో ఉత్సాహం మరింత పెరిగింది.
దీంతో తిరుపతిలో గొడవలు సృష్టించేందుకు రెడీ అయ్యారు బీజేపీ-జనసేన నేతలు. వ్యక్తిగత వివాదాలను కూడా వైసీపీకి ఆపాదిస్తూ.. పోలీసులను బ్లేమ్ చేస్తూ సరికొత్త నాటకానికి తెరతీశారు.