సంచలన, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజు నోటీసులు జారీ చేసింది. ‘దిశ ఎన్‌కౌంటర్’ చిత్రంపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
గతేడాది నవంబర్ 26న షాద్ నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ అయిన యువతి సామూహిక హత్యాచారానికి గురైంది. ఈ దుర్ఘటన ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కించారు.
ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. హత్యాచారానికి గురైన నవంబర్ 26నే సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆల్రెడీ నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారని, ఆ కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో ఉన్నాయని, మళ్లీ వాళ్లపై సినిమా తీయడం అంటే ఆ గాయాల్ని గెలకడమే అని పిటిషినర్ల తరపు న్యాయవాది కృష్ణమూర్తికి హైకోర్టుకు నివేదించారు.
ఈ సినిమా విడుదల వల్ల చివరికి నిందితుల కుటుంబ సభ్యులు ఊళ్లో కూడా ఉండలేని పరిస్థితి వస్తుందని న్యాయవాది పేర్కొన్నారు. చేయని తప్పునకు నిందితుల కుటుంబ సభ్యులను దోషులుగా నిలిపే పరిస్థితిని వర్మ తీసుకొస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కావున సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. అందులోనూ దుర్ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరుగుతున్న పరిస్థితుల్లో సినిమా తీస్తున్న విషయాన్ని పిటిషినర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వాదనలు విన్న న్యాయస్థానం దర్శకుడు వర్మతో పాటు ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, తదితర సంస్థలకు షోకాజు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.