భారతీయ జనతా పార్టీ నేతలను పవన్ కల్యాణ్ చాలా చాలా గౌరవిస్తూ ఉన్నారు పొత్తు అనుకున్నప్పటి నుంచి. స్థానిక నేతల మాటెలా ఉన్నా.. ఢిల్లీ నేతలను మాత్రం ఆ జీ, ఈ జీ అని చాలా గౌరవప్రదంగా సంబోధిస్తూ, విధేయతను చాటుకుంటూ ఉన్నారు.
గతంలో బీజేపీ నేతలను పవన్ కల్యాణ్ ఏమన్నారు, వారిని మత చిచ్చు పెట్టే వారికి అభివర్ణించడం అవన్నీ వేరే సంగతి. అప్పుడంటే పవన్ కల్యాణ్ కు కమ్యూనిస్టులు, చేగువేరా, ఎర్రజెండాలు, మాయవతి.. ఆరాధ్యనీయులు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కొత్తగా కాషాయం కట్టిన వ్యక్తి. దీంతో బీజేపీ వాళ్ల కన్నా ఐదాకులు ఎక్కువగా తిన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.
మరి ఇంత చేస్తే.. అమిత్ షా ఏపీ పర్యటనలో జనసేన అధిపతి ఊసే లేకపోవడం విడ్డూరమూ, విశేషమే. అమిత్ షా వచ్చి వెళ్లింది కేవలం అధికారిక కార్యక్రమానికే కాదు, పార్టీ మీటింగుకు కూడా. మరి ఏపీలో బీజేపీ అంటే.. బీజేపీ నేతలు మాత్రమే కాదు కదా! బీజేపీతో పొత్తును కలిగి ఉన్న జనసేన ఊసు అమిత్ షా పర్యటన సందర్భంగా కాస్తైనా వినిపించాల్సిందనుకోవడం వింత ఏమీ కాదు.
అందులోనూ ఇప్పటికే పవన్ కల్యాణ్ బీజేపీ కోసం చాలా త్యాగం చేశారు. తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నిక టికెట్ ను త్యాగం చేశారు. ఇక బద్వేల్ లో ఏం చేశారనేది, అక్కడ పవన్ కు ఏముంది అనేది వేరే కథ. తిరుపతి ఉప ఎన్నిక వరకూ అయితే.. బీజేపీకి పవన్ మద్దతుగా ప్రచారం కూడా చేశారు.
మరి తిరుపతి ఉప ఎన్నికప్పుడు బీజేపీ నేతలతో కనిపించిన పవన్ కల్యాణ్, అదే తిరుపతికి అమిత్ షా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం.. బీజేపీ నేతల మాటున కనిపించలేదు. అందులోనూ ఏపీలో ఎలా అధికారంలోకి రావాలనే అంశం గురించి షా పాల్గొన్న కార్యక్రమంలో చర్చించినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి అలాంటి సమయంలో తమ మిత్రుడు అయిన పవర్ స్టార్ బీజేపీ వాళ్లకు గుర్తుకురాకపోవడం గమనార్హం.
అది పక్కా బీజేపీ సమావేశమే అనుకున్నా… తమ వెనుక ఒక పవర్ ఉందంటూ.. అత్తారింటికి దారేదీ సినిమాలో పోసాని తరహాలో ఒక్క బీజేపీ నేత డైలాగ్ కూడా వేయలేదని తెలుస్తోంది. ఎంతసేపూ తాము సొంతంగా ఎలా అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా మెలగాలి.. ప్రత్యామ్నాయం కావాలనే అంశం గురించి మాట్లాడారట కానీ, తమతో జనసేన అనే ఒక పార్టీ ఉంది అనే చర్చను మాత్రం చేపట్టలేదట.
బీజేపీతో దోస్తీ కుదిరి చాలా కాలమే అయినా.. పవన్ కల్యాణ్ ఢిల్లీలో పెద్ద నేతల అపాయింట్మెంట్లను సంపాదించలేకపోయారు. ఇక స్వయంగా అమిత్ షా నే ఏపీకి వచ్చిన సందర్భంలో కూడా పవన్ కల్యాణ్ ఊసు లేకపోవడం గమనార్హం.