బీజేపీ ఎంపీ అధికార కావ‌రం…‘ గాంధీజీ’పై దూష‌ణ‌లు

బీజేపీ నేత‌ల‌కు అధికార అహంకారం బాగా త‌ల‌కెక్కిన‌ట్టుంది. చివ‌రికి భార‌తీయులంతా ‘మ‌హాత్మ’ అని ఎంతో ప్రేమ‌, ఆప్యాయ‌ల‌తో పిలుచుకునే గాంధీజీని కూడా దూషించ‌డానికి వెనుకాడ‌టం లేదు. జాతిపిత మ‌హాత్మ‌గాంధీపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ…

బీజేపీ నేత‌ల‌కు అధికార అహంకారం బాగా త‌ల‌కెక్కిన‌ట్టుంది. చివ‌రికి భార‌తీయులంతా ‘మ‌హాత్మ’ అని ఎంతో ప్రేమ‌, ఆప్యాయ‌ల‌తో పిలుచుకునే గాంధీజీని కూడా దూషించ‌డానికి వెనుకాడ‌టం లేదు. జాతిపిత మ‌హాత్మ‌గాంధీపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత‌కుమార్ హెగ్డే తీవ్ర అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశాడు.

గాంధీజీ చేసిన స్వాతంత్ర్య పోరాటం అంతా ఓ డ్రామా అని ఆయ‌న మ‌హాత్మునిపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నాడు. అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు. ‘అలాంటి వాళ్లను’ మ‌న‌ దేశంలో ‘మహాత్మ’ అని ఎందుకు పిలవాలని ప్రశ్నించాడు. బెంగ‌ళూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ఉత్త‌ర క‌ర్నాట‌క నుంచి ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

‘గాంధీజీ నడిపిన స్వాతంత్ర్య ఉద్యమమంతా బ్రిటీష్ వాళ్ల అనుమతితో, వారి ప్రోద్బలంతోనే సాగింది. ప్రముఖులైన ఈ నాయకులెవరూ ఎప్పూడు ఒక్క లాఠీ దెబ్బ కూడా తినలేదు. వాళ్ల స్వాతంత్ర్య ఉద్యమమంతా ఓ నాటకం. అదంతా బ్రిటీష్ వాళ్లతో కుమ్మక్కయి నడిచిందే. అది నిజమైన పోరాటం కాదు. అదో సర్దుబాటు స్వాతంత్ర్య ఉద్యమం’ అని తీవ్రమైన ఆరోప‌ణ‌లు చేశాడు.
 
మహాత్మాగాంధీ నిరాహార దీక్ష, సత్యాగ్రహం కూడా ఓ ‘నాటకమే’ అంటూ హెడ్గే చెప్పుకొచ్చాడు. సత్యాగ్రహం వల్ల బ్రిటీష్ వాళ్లు దేశాన్ని విడిచిపెట్టలేదని, వాళ్లకు విసుగుపుట్టి దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చార‌ని బీజేపీ ఎంపీ చెప్ప‌డం గ‌మ‌నార్హం. చరిత్ర చదివినప్పుడు త‌న‌ రక్తం మరిగిపోతుంద‌ని, అలాంటి వాళ్లు మన దేశంలో మహాత్ములయ్యారు  అంటూ బీజేపీ ఎంపీ ప్ర‌సంగాన్ని ముగించాడు.

‘ఎల్లో’ వైరస్‌ కరోనా కంటే ప్రమాదకరం