గత ఏడాది మార్చి నాటికి దేశంలోని 70 శాతం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండేది. అప్పుడే 'కాంగ్రెస్ ముక్త్ భారత్' నినాదాన్ని కమలం పార్టీ వాళ్లు గట్టిగా వినిపించారు. కాంగ్రెస్ ను దేశంలో లేకుండా చేస్తామంటూ అమిత్ షా ప్రకటించారు. 2018 మార్చి నాటికి దేశంలో డెబ్బై శాతం బీజేపీ పాలిత రాష్ట్రాలుంటే.. ఇప్పుడు ఆ పార్టీ చేతిలో మిగిలిన ప్రాంతం 34 శాతం! అంటే సగం ప్రాంతంపై భారతీయ జనతా పార్టీ పట్టు కోల్పోయింది.
కాంగ్రెస్ ముక్త్ భారత్ సంగతేమో కానీ, రాష్ట్రాల వారీగా ఎన్నికలు ఇలానే సాగితే.. భారతీయ జనతా పార్టీకి మిగిలేది కేంద్రంలో పవర్ మాత్రమేనేమో అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి కొన్నాళ్లలో కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కమలం పార్టీ కి క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్న రాష్ట్రాల్లో యూపీ, కర్ణాటక, గుజరాత్, బిహార్.. ఇవి మాత్రమే పెద్దవి. మిగతావన్నీ బుల్లిబుల్లి రాష్ట్రాలే. ఈశాన్య రాష్ట్రాలన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయి. అయితే పౌరసత్వ సవరణల చట్టం నేఫథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే.. బీజేపీ పరిస్థితి ఏమవుతుందో ఎవరికీ తెలీదు.
ఇక కర్ణాటకలో ఇప్పుడే ఎన్నికలు లేనట్టే. గుజరాత్ కూడా ఇప్పుడప్పుడే కాదు. యూపీ విషయంలోనూ ఇంకా టైముంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో బిహార్ ముందుంటుంది. అలాగే ఢిల్లీలోనూ కమలం పార్టీ సత్తా ఏమిటో తేలే సమయం త్వరలోనే రానుంది!