కమలదుందుభి మోగింది సరే.. తెలుగు రాష్ట్రాలపై నో ఎఫెక్ట్!

రెండు మూడు రాష్ట్రాలకు కలిపి శాసనసభ ఎన్నికలు జరిగే ప్రతిసారీ.. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ఇది సెమీఫైనల్ లాంటి డైలాగులు వినిపిస్తూనే ఉంటాయి. ఈసారి అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగ్గా యూపీ వంటి పెద్ద…

రెండు మూడు రాష్ట్రాలకు కలిపి శాసనసభ ఎన్నికలు జరిగే ప్రతిసారీ.. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ఇది సెమీఫైనల్ లాంటి డైలాగులు వినిపిస్తూనే ఉంటాయి. ఈసారి అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగ్గా యూపీ వంటి పెద్ద రాష్ట్రం ఉండడం వలన.. ఈ ఎన్నికలు కేంద్ర సర్కారుపై ప్రజాభిప్రాయాన్ని పరిగణించడానికి తూకం రాయిగా ఉపయోగపడేవే. మొత్తానికి భారతీయ జనతా పార్టీ.. తమ హవా అప్రతిహతంగా సాగుతున్నదని చాటుకోడానికి వీలుగానే ఫలితాలు వచ్చాయి. ఎటూ వారి చేతిలో లేని పంజాబ్‌లో మాత్రమే ఓటమి పాలయ్యారు. మొత్తంగా కమల సేనలకు ఇవి శుభఫలితాలు.

ఈ ఫలితాల నేపథ్యంలో రాజకీయ భవిష్య పరిణామాలు ఏమిటి, ఎలా సాగబోతున్నాయనే విషక్ష్ంలో చాలా చాలా అంచనాలు ఉండొచ్చు. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు ఏం జరిగే అవకాశం ఉన్నదో ఆసక్తికరం. 

రెండు తెలుగు రాష్ట్రాలు కాషాయ రాజకీయాల కోణంలో చూసినప్పుడు చాలా భిన్నమైనవి. తెలంగాణలో ఆ పార్టీకి కొంత బలం ఉంది. ఇక్కడ తెలంగాణలో కాదు కదా.. ఆ పార్టీని జాతీయ స్థాయిలోనూ చీల్చిచెండాడాలని ఉరకలేసే కేసీఆర్ తో ప్రబలమైన వైరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఠికానా లేదు. ఒక్కచోటైనా డిపాజిట్ తెచ్చుకోగలరో లేదో అనిపించే పరిస్థితి. అయితే అక్కడ ఆ పార్టీని వ్యతిరేకించే దమ్ము మరే ఇతర పార్టీకీ లేదు. ఇలాంటి నేపథ్యంలో తెలుగురాష్ట్రాల రాజకీయాలపై ప్రభావం ఎలా ఉంటుందో అవలోకన.. ఈ వ్యాసం.

పవన్‌కు మోదమా? ఖేదమా?

ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామి! కానీ ఒక్క విషయం గమనించారా? నాలుగు రాష్ట్రాల్లో నరేంద్రమోడీ హవా ప్రతిఫలించి.. బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత.. ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ కనీసం వారిని అభినందిస్తూ ఒక ట్వీట్ కూడా చేయలేదు. ఎన్డీయేతో సంబంధం లేకపోయినా.. ఇతర పార్టీల నాయకులు కూడా ఎంతో మంది.. విజేతలను అభినందించేశారు. కానీ పవన్‌కు మాత్రం అంత ఖాళీ చిక్కలేదు. 

అంతమాత్రాన కూటమినుంచి పవన్ కల్యాణ్ వెలుపలికి వెళ్లిపోతారనుకోవడం భ్రమ. అంతకంటె ముఖ్యంగా పవన్‌ను వాళ్లు వెళ్లనిస్తారనుకోవడం భ్రమ. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు కనీస ఓట్లకు గతిలేకపోయినా.. పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ను వాడుకుని.. రాజకీయంగా ఒక ఆట ఆడాలని ఉవ్విళ్లూరుతోంది. పవన్ తో జట్టు కట్టడం వలన ఏకపక్షంగా నెగ్గబోయేదేమీ లేదని, తనే రెండు సీట్లలోనూ ఓడిపోయిన పవన్ కు తమ పార్టీని అధికారంలోకి తీసుకువెళ్లేంత దృశ్యంలేదని కమలనాధులకు తెలుసు. పేరుకు ఒక కూటమిలోని రెండు పార్టీలు అనుకోవాల్సిందే గానీ.. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ పార్టీలు రెండూ పొత్తుల్లోని పార్టీల్లాగా కలిసిమెలిసి ప్రవర్తించిన సంఘటనలు ఒకటిరెండుకు మించి లేవు. 

కానీ ఒక రకంగా చెప్పాలంటే.. కమలనాధులు పవన్ కల్యాణ్ ను చక్రబంధంలో ఇరికించినట్లే. పవన్ వల్ల తాము నెగ్గడం జరగదని, తమ బలం వల్ల పవన్ కూడా నెగ్గడని వారికి తెలుసు. కానీ.. పవన్ కు ఉండే ఆ కొద్ది ఆదరణ ఇతరులకు ప్లస్ పాయింట్ కాకుండా.. ఆయనను ఈ కూటమిలో లాక్ చేసి పెట్టడమే వారి వ్యూహం. అసలే చంద్రబాబునాయుడు.. తాను కన్నుగీటినా పవన్ పట్టించుకోవడం లేదని పదేపదే అంటున్నారు. చంద్రబాబు వన్ సైడ్ లవ్ కు పచ్చజెండా ఎత్తేసి పవన్ అటువైపు జంప్ అయిపోకుండా కమలప్రేమ ఒక దిగ్బంధన మంత్రం. అంతే!

పవన్ కల్యాణ్ కు ఇప్పుడు తాను ఇరుక్కుపోయాను అనే సంగతి పూర్తిగా అర్థమై ఉంటుంది. మనసులో చంద్రప్రేమ ఆయనను గిలిగింతలు పెడుతుంటుంది. కానీ.. బయటకు వెళ్లలేడు. మోడీ బలం ఏ కొంచెమైనా తగ్గి ఉంటే.. దేశమే మోడీ పట్ల పునరాలోచనలో ఉన్నది అనే సాకు చెప్పి.. ఏపీ ప్రయోజనాలు, ఏపీ ప్రజల సంక్షేమం కంటె మోడీతో స్నేహం నాకు పెద్ద ఎక్కువేమీ కాదు అని పంచ్ డైలాగులు వల్లించి.. ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించి ఉండేవారు. కానీ.. ఇప్పుడు ఆ విషయంలో మీమాంస తప్పదు. గుంజాటన తప్పదు. మోడీ విజయం పట్ల ఆయన మనస్ఫూర్తిగా హర్షించలేని స్థితిలో పడిపోయారు. 

చంద్రబాబుకు ఈ ఫలితాలు శాపం..

ఈ ఫలితాలు చంద్రబాబుకు మాత్రం శాపమే. ఏదో రకంగా పవన్ భుజాల మీద తుపాకీ పెట్టి.. జగన్ ను కొట్టాలనేది చంద్రబాబు లక్ష్యం. కానీ.. పవన్ చేతికి చిక్కడం లేదు. అవకాశమూ కనిపించడం లేదు. రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితి చూస్తే.. దేశంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న స్థితికంటె భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కాంగ్రెస్–ఇక్కడ టీడీపీ అన్నట్టుగానే వారి బలం దిగజారుతోంది.

చెప్పుకోడానికి ఒకరిద్దరు నాయకులు పార్టీలో మిగిలారు. వారు గెలుస్తారో లేదో తెలియదు. గెలిచిన వారు వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో ఉంటారో లేదో తెలియదు. తన కొడుకే రాజకీయ వారసుడు అనే బిల్డప్ పార్టీని ఇంకా ఎంత గొప్ప పాతాళాల్లోకి చేర్చబోతున్నదో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. అందుకే ఆయన అదే ఎజెండాతో పార్టీ పతనాన్ని నిర్దేశిస్తున్నారు. 

వైసీపీది సేఫ్ గేమ్

మోడీ సర్కారుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలినుంచి సేఫ్ గేమ్ ఆడుతోంది. వారి కూటమిలో లేదు. అలాగని వారి పట్ల వైరం లేదు. రాష్ట్రంలో బీజేపీని సహించడమూ లేదు. వారినుంచి వచ్చే విమర్శలను వదిలిపెట్టడమూ లేదు. పనిగట్టుకుని జగన్ ను విమర్శించాలనుకునే వాళ్లు.. మోడీ వద్ద వంగి ఉన్నట్టుగా అంటూ ఉంటారు. ఒక రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలో అదే జరుగుతూ ఉంటుంది. 

ఇప్పుడు మోడీ పార్టీ ఘనవిజయం సాధించినంత మాత్రాన.. వైసీపీ కొత్తగా వారికోసం మెత్తబడేదేమీ లేదు. అలాగని రాష్ట్రంలో కూడా వారు తమకు అడ్డుగా తయారవుతారని, తమ అధికారాన్ని దెబ్బ కొడతారని భయపడవలసిన అవసరం కూడా లేదు. మరికొన్ని దశాబ్దాలు గడచినా ఏపీలో బీజేపీ అధికారం అంచులవరకు రావడం సాధ్యం కాదనే సంగతి వైసీపీకి బాగా తెలుసు.

కేసీఆర్ అగమ్యగోచరం..

ఒక్క కేసీఆర్ పరిస్థితి అగమ్యగోచరం మాత్రమే కాదు. ఆయన తలపెట్టిన కూటమి మొత్తం అగమ్యగోచరంగా మారినట్టే అనుకోవాలి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కేసీఆర్ ఆశ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. మమతా బెనర్జీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోదలచుకుంటే పెద్ద ఇబ్బందేం ఉండదు. స్టాలిన్ తో బంధం ముడేసుకున్నా ఇప్పుడు కుదరవచ్చు. 

కాకపోతే.. పంజాబ్ ను స్వీప్ చేసేసి.. బలమైన పార్టీగా అవతరించిన ఆప్ తో ముడిపెట్టుకోవాలంటే.. అందుకు ఆయన కొంత మూల్యం చెల్లించాలి. జాతీయ పార్టీగా దేశమంతా విస్తరించాలని అనుకుంటున్న కేజ్రీవాల్ తో స్నేహం కావాలంటే.. తెలంగాణలో కొన్ని సీట్లు ఆయనకు త్యాగం చేయవలసిన పరిస్థితి రావొచ్చు. అందుకు కేసీఆర్ సిద్ధంగానే ఉన్నారా? అనేది పెద్ద ప్రశ్న.

కాకపోతే ఈ ఫలితాల వలన ఒక ఎడ్వాంటేజీ ఉంది. కేసీఆర్ తలపెడుతున్న బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమికి ఒక శుభసంకేతం ఈ ఫలితాల వల్ల అందుతోంది. బీజేపీయేతర అంటే ఎగబడి వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు గానీ.. కాంగ్రెసేతర అనే పదం కూడా కలిపితే.. మహారాష్ట్రలోని శివసేన, తమిళనాడులోని డీఎంకే కొంత ఆలోచించే పరిస్థితి. ఆయా రాష్ట్రాల్లో వారి ప్రస్తుత కూటమి సమీకరణల దృష్ట్యా వెంటనే ఒప్పుకుంటారా?  అనే సందేహం ఉండేది. 

కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇంత అథమస్థాయికి పతనం అయిపోయిన తర్వాత.. ఇంకా ఆ పార్టీతో పొత్తులు కొనసాగిస్తూ తమ భవిష్యత్తును ఇబ్బందిపెట్టుకోవాలని వారు అనుకోరు. అందుకు సాహసించారు. ఏతావతా.. కేసీఆర్ సంకల్పిస్తున్న కూటమి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. 

మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలు.. తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడున్న వాతావరణంలో పెద్దగా మార్పు తెచ్చే అవకాశం మాత్రం లేదు. ఇటు తెలంగాణలో అయినా, అటు ఏపీలో అయినా స్టేటస్ కో కొనసాగుతుందనే అనుకోవచ్చు.

.. ఎల్. విజయలక్ష్మి