వైసీపీ పార్టీకి పండుగ లాంటి ఆవిర్భావ దినోత్సవ వేళ సంబరాలు జరుపుకోవాల్సిన నేతలు వర్గాలుగా విడిపోవడం దేనికి సంకేతం. చాలా కాలంగా విభేదాలు ఉన్నా కూడా ఇలా అధికారికంగా బయటపడడం మాత్రం వైసీపీ పెద్దలకు ఉలిక్కిపడేలా చేసే పరిణామమే అంటున్నారు.
విశాఖ జిల్లాలోని పాయకరావుపేటనియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రెండు కళ్ళూ చాలనంతగా సాగాయి. అలాగే రెండు వర్గాలతో విడివిడిగా జరిగాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పార్టీ జెండా ఎగరేసి వైభవాలు చేసిన సీన్ ఒక వైపు ఉంటే మరో వైపు ఆయన ప్రత్యర్ధి వర్గం సొంత పార్టీలోనే ఎదురు నిచిలిన వారంతా చేరి పార్టీ పండుగను జరుపుకొవడం విశేషం.
రెండవ వర్గానికి మాజీ ఎమ్మెల్సీ డీవీఎస్ రాజుతో పాటు పలువురు అసమ్మతి నేతలు చిక్కాల రామరావు, వీసం రామక్రిష్ణ, గోవింద్, ఎంపీపీ శారదాకుమారి హాజరై తమ నాయకత్వంలో ఈ వేడుకలు జరిపారు. మొత్తానికి ఒకే పార్టీ రెండు గొడుగులు, ఒకే జెండా రెండు వర్గాలు ఇలా నిండుగా ఉన్న ఫ్యాన్ పార్టీతో రెండు ముక్కలాట ఆడిన వైనం అచ్చంగా పాయకరావుపేటకే దక్కింది.
ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే పైన బహిరంగ విమర్శలు చేస్తూ రోడ్డుకెక్కిన అసమ్మతి వర్గం ఒక వైపు ఉంటే ఎమ్మెల్యే వర్గం మరో వైపు ఉంది. ఈ రెండు వర్గాలను కలసి కట్టుగా ఉండాలని పెద్దలు చెప్పిన సుద్దులు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని తాజా ఉదంతం రుజువు చేస్తోంది.