తిరుప‌తి ఉప‌పోరు ర‌ద్దుకు బీజేపీ పోరాటం, ఫ‌లిత‌మిస్తుందా?

తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది క‌మ‌లం పార్టీ. ఇప్పటికే ఈ విష‌యంలో బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేసిన బీజేపీ నేత‌లు, ఈ అంశంపై హై కోర్టును కూడా ఆశ్ర‌యించారు.  Advertisement తిరుప‌తిలో…

తిరుప‌తి ఉప ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది క‌మ‌లం పార్టీ. ఇప్పటికే ఈ విష‌యంలో బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేసిన బీజేపీ నేత‌లు, ఈ అంశంపై హై కోర్టును కూడా ఆశ్ర‌యించారు. 

తిరుప‌తిలో బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసిన ర‌త్న‌ప్ర‌భే ఈ పిటిష‌న్ ను దాఖ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో సీఈసీని, ఇత‌ర అభ్య‌ర్థుల‌ను ప్ర‌తివాదులుగా చేర్చారామె. ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌స్తే వ్య‌వ‌హారం ఆస‌క్తిదాయ‌కంగా మారే అవ‌కాశం ఉంది.

నోటిఫికేష‌న్ ప్ర‌కారం.. ఇప్పుడ‌ప్పుడే తిరుప‌తి లోక్ స‌భ సీటు ఉప ఎన్నిక ఫ‌లితాలు రావు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పాటు తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఈ నేప‌థ్యంలో.. దానికి స‌మ‌యం ఉంది. ఆ లోపు హైకోర్టులో విచార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉంది.

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ముందుగా తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వర్గం ప‌రిధిలో మాత్ర‌మే రిగ్గింగ్ జ‌రిగింద‌న్న‌ట్టుగా బీజేపీ, టీడీపీలు ఆరోపించాయి. మొత్తం ఏడు అసెంబ్లీ నియోక‌వ‌ర్గాల్లో ఆరు నియోజ‌క‌వ‌ర్గాల‌పై వీళ్ల‌కు అప్పుడు అభ్యంత‌రాలు లేవు. 

ఆరు నియోజ‌క‌వ‌ర్గాల‌పై కంప్లైంట్లు చేయ‌కుండా, ఇప్పుడు మొత్తం ఉప ఎన్నిక‌నే ర‌ద్దు చేసేయాల‌నే డిమాండ్ విడ్డూర‌మైన‌ది. అందులోనూ ఈ అంశంపై ఇప్ప‌టికే సీఈసీకి కంప్లైంట్ ఇచ్చిన‌ట్టుగా ఉన్నారు.

ఇక ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు ప్లేటు ఫిరాయించారు. మొద‌ట తిరుప‌తి అసెంబ్లీ నియోక‌వ‌ర్గంలో అక్ర‌మాల‌ని ఆరోపించి, ఇప్పుడు రెండు ల‌క్ష‌ల దొంగ ఓట్లు ప‌డ్డాయంటూ చంద్ర‌బాబు కొత్త ఆరోప‌ణ చేశారు. మ‌రి ఈ ఆరోప‌ణ‌లు, ఫిర్యాదుల‌పై సీఈసీ, కోర్టులు ఎలా స్పందిస్తాయో!