ఎక్కువ మాట్లాడితే వేటే.. బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్!

గ‌త వారంలో ఢిల్లీ స్థాయిలో ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన రాజ‌కీయ ప‌రిణామం చోటు చేసుకుంది. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గాన్ని స‌మీక్షించింది ఆ పార్టీ అధిష్టానం. మొత్తం 80 మంది కార్య‌వ‌ర్గ స‌భ్యుల విష‌యంలో స్వ‌ల్ప మార్పు…

గ‌త వారంలో ఢిల్లీ స్థాయిలో ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన రాజ‌కీయ ప‌రిణామం చోటు చేసుకుంది. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గాన్ని స‌మీక్షించింది ఆ పార్టీ అధిష్టానం. మొత్తం 80 మంది కార్య‌వ‌ర్గ స‌భ్యుల విష‌యంలో స్వ‌ల్ప మార్పు చేర్పులు చేసుకున్నాయి. 

కొత్త చేర్పుల్లో ఒక‌టి బాగా ఆస‌క్తిదాయ‌కం కాగా, ముగ్గురు స‌భ్యుల‌ను సాగ‌నంప‌డం కూడా హైలెట్. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం నుంచి తొల‌గించ‌బ‌డిన వారి జాబితాలో న‌లుగురే ఉన్నారు! నాలుగో పేరు ప‌క్క‌న పెడితే, కేంద్ర మాజీ మంత్రులు మేన‌కాగాంధీ, సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, బీజేపీ ఎంపీ- మేన‌క త‌న‌యుడు వ‌రుణ్ గాంధీల‌ను బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం నుంచి తొల‌గించారు. 

విశేషం ఏమిటంటే.. వీరిలో ఇద్ద‌రు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప‌లు విధానాల‌పై కాస్త ఘాటుగా స్పందించిన వారు. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు… మోడీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ఆర్థిక విధానాల‌పై ఆయ‌న ప‌లు సార్లు మాట్లాడు. దేశ ఆర్థిక వ్య‌వ‌హారాల గురించి మాట్లాడ‌గ‌ల అన్ని అర్హ‌త‌లూ ఉన్న వ్య‌క్తి స్వామి. అయితే ఆయ‌న వ్యాఖ్యానం బీజేపీకి రుచించ‌లేదు!

ఇక 2014లో బీజేపీ అధికారంలోకి రావ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేసిన వారిలో స్వామి ముఖ్యులు! జ‌నతా పార్టీ అధినేత‌గా అప్ప‌ట్లో బీజేపీకి ఎంతో మేలు చేశారు స్వామి. జ‌రిగిందో లేదో తెలియ‌ని 2జీ స్కామ్ గురించి పోరాడి.. కాంగ్రెస్ ను ముప్పుతిప్ప‌లు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాపింది మ‌రెవ‌రో కాదు, సుబ్ర‌మ‌ణ్య‌స్వామినే.

2జీ స్కామ్ పై కాంగ్రెస్ హ‌యాంలోనే అన్ని చ‌ర్య‌లూ జ‌రిగినా.. ఆ స్కామ్ పై జ‌రిగిన ప్ర‌చార‌మే కాంగ్రెస్ పై తీవ్ర‌వ్య‌తిరేక‌త‌ను పెంపొందించింది. ఇక నేష‌న‌ల్ హెరాల్డ్ వ్య‌వ‌హారంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌ను కోర్టుల చుట్టూ తిప్పింది మ‌రెవ‌రో కాదు.. సుబ్ర‌మ‌ణ్య‌స్వామే!  ఈ అంశంపై మోడీ త‌ర‌చూ మాట్లాడుతూ ఉంటారు కూడా. మరి బీజేపీకి ఇన్ని ఆయుధాల‌ను అందించిన స్వామి.. జ‌స్ట్ విధానాల‌ను త‌ప్పుప‌ట్టారు అని జాతీయ కార్య‌వ‌ర్గం నుంచి త‌ప్పించేశారంతే!

మార్పులు చేసుకోండి.. అని చెప్పినందుకు స్వామికి ద‌క్కిన ప్ర‌తిఫ‌లం ఇది. అస‌లు సుబ్ర‌మ‌ణ్య‌స్వామే అప్పుడు కాంగ్రెస్ పై ఆ రేంజ్ పోరాటం చేయ‌క‌పోతే.. బీజేపీకి 2014లో ప‌ల్లెంలో దొరికిన‌ట్టుగా అధికారం ద‌క్కేదా? అనేది ప్ర‌శ్నార్థ‌క‌మే! కాంగ్రెస్ ను చీల్చిచెండాడి, తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త‌ను పెంచ‌డంలో.. అది కూడా ఊహాజ‌నిత స్కామ్ అయిన 2జీ వ్య‌వ‌హారంలో స్వామి చేసింది అంతా ఇంతా కాదు సుమా!

ఇక రైతుల పోరాటానికి హ‌త్య‌లు జ‌వాబు కాదు.. అనే ట్వీటేసి, ఆ వీడియోను షేర్ చేసిన వ‌రుణ్ గాంధీకి కూడా చాలా ఘాటు స‌మాధాన‌మే ఇచ్చారు. వ‌రుణ్ తో పాటు, ద‌శాబ్దాలుగా బీజేపీతో క‌లిసి సాగుతున్న మేన‌క‌గాంధీని కూడా జాతీయ కార్య‌వ‌ర్గం నుంచి త‌ప్పించేశారు!

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, వ‌రుణ్ గాంధీలు.. ఏమీ ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌లేదు. జ‌స్ట్ విధాన‌ప‌రంగానే మాట్లాడారు. అందుకు వారికి గ‌ట్టి ప్ర‌తిఫ‌ల‌మే ద‌క్కింది. బ‌హుశా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మేన‌క‌, వ‌రుణ్ ల‌కు బీజేపీ ఎంపీ టికెట్లు ద‌క్కే అవ‌కాశాలు కూడా మృగ్యం అయిన ప‌రిస్థితే క‌నిపిస్తోంది. స్వామికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వ కాలం పూర్త‌యితే రిటైర్మెంట్ ఖాయంగా క‌నిపిస్తూ ఉంది!