జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఆ పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ తలనొప్పిగా మారారు. పేరుకు తగ్గట్టే బొలిశెట్టి సత్యాలే మాట్లాడ్డం జనసేన పార్టీకి మింగుడు పడడం లేదు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం ఒంటరిగా ఏ పార్టీకి సాధ్యమయ్యే పని కాదని ప్రతిపక్షాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
ఇప్పటికే జనసేన- బీజేపీ పొత్తులో ఉన్నాయి. రాబోవు రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీల్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఆయన సభాముఖంగా కోరారు. పొత్తులపై రానున్న రోజుల్లో ఆలోచిస్తామని ఆయన ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ మధ్య పొత్తు దాదాపు ఖరారైందనే చర్చకు తెరలేచింది. జనసేన తమతో కలిసి రానుంది, 2024లో అధికారం తమదేనని టీడీపీ ఉత్సాహంగా ఉంది.
టీడీపీ ఆశలపై నీళ్లు చల్లేలా జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతున్నారు. అంతేకాదు, జనసేనాని పవన్‌కల్యాణ్ మనసు నొప్పించేలా టీడీపీపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. వివిధ చానళ్లలో బొలిశెట్టి సత్యనారాయణ ఏమన్నారో తెలుసుకుందాం.
” ప్రత్యామ్నాయం లేనప్పుడు మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. పొత్తు విషయమై పవన్‌కల్యాణ్ కన్ఫామ్ చేశాడని, చంద్రబాబు చేయాల్సి ఉందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ చెప్పందాన్ని అన్వయించడం కరెక్ట్ కాదు. టీడీపీ, జనసేన మధ్య ఓన్లీ మీడియా సృష్టి. మైండ్ గేమ్. కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నదల్లా మీడియానే. జనసేన పార్టీకి క్లారిటీ ముందు నుంచి ఉంది. రెండు కుటుంబ పార్టీల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి వచ్చిన పార్టీ జనసేన.
గతంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపై చేసిన విమర్శలను పవన్ వెనక్కి తీసుకోలేదు. టీడీపీ, వైసీపీలతో మా పార్టీకి భావసారూప్యత లేదు. పొత్తులు లేకుండా టీడీపీ బతక లేదు కాబట్టి, అది మైండ్ గేమ్ ఆడుతోంది. గతంలో 2019లో చేసినట్టే ఇవాళ మరోసారి దెబ్బతీసేందుకే టీడీపీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారంలో నిజం లేదు. ఈ రెండు కుటుంబ పార్టీలకు మేము వ్యతిరేకం.
పవన్‌కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పిన తర్వాత వైసీపీ వ్యతిరేక ఓటు చీలే అవకాశమే లేదు. అది పవన్ చెప్పినదాంట్లో సారాంశం ” అని బొలిశెట్టి టీడీపీ, ఎల్లో మీడియాపై ఎదురు దాడికి దిగారు.
పవన్ మనసులో మాట తెలియకుండా టీడీపీపై బొలిశెట్టి అనవసరంగా విమర్శలకు దిగి, పార్టీకి నష్టం కలిగిస్తున్నారనే అభిప్రాయాలు జనసేన నుంచి వినిపిస్తున్నాయి. కానీ బొలిశెట్టి తీసుకున్న స్టాండే సరైందని, ఆయన చెప్పినట్టు చేయడం వల్ల పార్టీ బలపడుతుందనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఇదిలా వుండగా తన అంతరంగాన్ని పసిగట్టకుండా బొలిశెట్టి సత్యాలు మాట్లాడ్డంపై జనసేనాని పవన్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం.