బాబు పెట్టిన అప్పు ఎంతంటే… ?

ఏపీలో ఇపుడు అప్పుల మీద అతి పెద్ద సమరం సాగుతోంది. అప్పులు చేస్తున్నారు అంటూ విపక్షాలు వైసీపీ సర్కార్ మీద గట్టిగానే పడుతున్నారు. మరే ఇతర సమస్యల కన్నా దీన్నే ముందు పెట్టి మరీ…

ఏపీలో ఇపుడు అప్పుల మీద అతి పెద్ద సమరం సాగుతోంది. అప్పులు చేస్తున్నారు అంటూ విపక్షాలు వైసీపీ సర్కార్ మీద గట్టిగానే పడుతున్నారు. మరే ఇతర సమస్యల కన్నా దీన్నే ముందు పెట్టి మరీ టార్గెట్ చేస్తున్నారు. 

టీడీపీతో పాటు జనసేన కూడా ఇపుడు గొంతు బాగా పెంచి వైసీపీ మీద బాణాలు వేస్తోంది. దీంతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ బాగానే రియాక్ట్ అయ్యారు. ఏపీలో రుణ భారతం గురించి తెలుసుకోవాలంటే ముందు మొదటి అధ్యాయాలు అన్నీ బాగా చదువు పవన్ అంటూ సూచించారు. 

వైసీపీ కొత్తగా తెచ్చిన అప్పులు కాదు, చంద్రబాబు హయాంలోనే ఏకంగా పాతిక తక్కువ రెండు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి గద్దె దిగిపోయారని ఆయన చిట్టా పద్దులు అన్నీ వల్లించారు.

బాబు అప్పుల సంగతిని నాడు ప్రశ్నిస్తాను అంటూ పార్టీ పెట్టిన పవన్ ఎందుకు అడగలేదు అని బొత్స గద్దించారు. తమ ప్రభుత్వం అప్పులు చేసినా సంక్షేమ అభివృద్ధి కోసమే అని, ఆ వివరాలు అన్నీ కూడా బాహాటమే అని కూడా బొత్స చెప్పుకొచ్చారు. 

మొత్తానికి అప్పుల ఆంధ్రా అంటూ దిగాలుగా రాగాలు తీస్తున్న విపక్షాలు టీడీపీని ముందుగా ప్రశ్నించాలని బొత్స చెప్పడం ద్వారా బాగానే కౌంటరేశారు.