ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై అన‌వ‌స‌ర అనుమానాలు

ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై అన‌వ‌స‌ర అనుమానాలు రేకెత్తిస్తున్నార‌ని రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై…

ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై అన‌వ‌స‌ర అనుమానాలు రేకెత్తిస్తున్నార‌ని రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మ‌న్‌ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను బుగ్గ‌న ఖండించారు. ఆయ‌న ఎందుక‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు.

పయ్యావుల కేశవ్‌ ఆరోపణలు అర్ధరహితమని కొట్టి పారేశారు. ఆడిట్‌ చేసినప్పుడు పలు రకాల ప్రశ్నలు వేస్తారన్నారు. అంత మాత్రాన‌ ఆడిట్‌ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేయ‌డం ఏంట‌ని బుగ్గ‌న నిల‌దీశారు. 

ప‌య్యావుల‌కు అనుమా నాలుంటే మీటింగ్ పెట్టి ప్ర‌భుత్వం నుంచి వివ‌ర‌ణ తీసుకోవ‌చ్చ‌న్నారు. రూ.41 వేల కోట్లు అవకతవకలు జరిగితే వ్యవస్థలు చూసుకోవా? ఏజీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖ చూపి ఆరోపణలు చేయడం శోచనీయమ‌న్నారు. గవర్నర్‌కు లేఖ, మీడియా సమావేశాలు ఇలా ఇన్ని విమర్శలేంటో అర్థం కావడం లేదన్నారు.  బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది పూర్తి అవాస్తవమని మంత్రి తెలిపారు.

రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని.. ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. సీఎఫ్‌ఎంఎస్‌ వచ్చాక ట్రెజరీ ద్వారా వ్యవస్థ నడవడం లేదన్నారు. ఈ వ్యవహారానికి సీఎఫ్ఎంఎస్‌ వ్యవస్థ కారణమ‌ని బుగ్గ‌న ఆరోపించారు. 2018లో సీఎఫ్ఎంఎస్‌ వ్యవస్థను మొదలుపెట్టింది టీడీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఈ వ్యవస్థను చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు  ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టారని మండిప‌డ్డారు.  

10895 కోట్ల బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌  లోపం వల్ల పీడీ అకౌంట్స్‌ నుంచి వెనక్కి వచ్చాయ‌న్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ ప్రోగ్రామింగ్‌లో లోపాలు ఉన్నాయన్నారు. అలాగే తెలంగాణ వాటాపై ఏపీ అప్పు తెస్తుందంటూ చేసిన ఆరోపణల్లో నిజం లేద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంపై మనకు అప్పు ఎలా ఇస్తారని బుగ్గ‌న ప్ర‌శ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న అప్పును రెండు రాష్ట్రాలు కడుతున్నాయని ఆర్థిక మంత్రి వెల్ల‌డించారు.  

జీతాలకు ఎలాంటి ఇబ్బంది లేదని బుగ్గ‌న స్ప‌ష్టం చేశారు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయాలని కుట్రలు చేస్తున్నారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.