టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. ప్రత్యర్థులను వేధించడం తన జన్మహక్కుగా భావిస్తారాయన. ఇదే తన దగ్గరికి వచ్చే సరికి వేధిస్తారా? అన్నీ గుర్తు పెట్టుకుని, వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించడం ఆయనకే చెల్లింది.
కాంగ్రెస్ నేత శంకరరావుతో కలిసి దివంగత టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు తదితరులు కలిసి జగన్ అవినీతికి పాల్పడ్డాడని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాల మేరకు జగన్‌పై సీబీఐ దర్యాప్తు, అనంతరం 16 నెలల పాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపారనేది జగమెరిగిన సత్యం. తాజాగా జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న చంద్రబాబు మాటలు వింటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. గుంటూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు మంగళవారం పరామర్శించారు. సంగం డెయిరీ కేసులో నరేంద్రకు జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత లోకేశ్ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇప్పుడు నరేంద్ర ఇంటికి చంద్రబాబు వెళ్లి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ నేతలపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మండి పడ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పనిచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించడం గమనార్హం. వైసీపీ తమ అవినీతి నుంచి దృష్టి మళ్లించేందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
ధూళిపాళ్ల నరేంద్రకు ప్రజలు కూడా అండగా నిలవాలని బాబు కోరారు. వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. చట్ట వ్యతిరేకంగా ప్రజల్ని, టీడీపీ నేతల్ని ఎలా హింసిస్తున్నారో వాటన్నింటినీ గుర్తు పెట్టుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. భవిష్యత్‌లో అన్నింటిపైనా సమీక్షిస్తామని తీవ్ర హెచ్చరిక చేశారు.
తమ పాలనలో ప్రత్యర్థులపై కేసులు, అరెస్టులు, వేధింపులు ఏవీ చంద్రబాబుకు గుర్తు లేవా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. తమ పట్ల ఎదుటి వాళ్లు ఎలా మర్యాదగా, మంచిగా ఉండాలని కోరుకుంటామో, తాము కూడా ఎదుటి వాళ్లతో అట్లే మెలగాలనే విచక్షణ కొరవడడం వల్లే నేడు ఏపీలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.