ఈ నెల 15న జగన్ సర్కార్ కేబినెట్ భేటీ కానుంది. ఈ దఫా మంత్రి వర్గ సమావేశానికి ఎంతో ప్రత్యేకత ఉండే అవకాశం ఎక్కువ. ఒక వైపు మంత్రి వర్గ సమావేశం, మరోవైపు రాజధాని తరలింపు అడ్డుకునేందుకు టీడీపీ ఎక్కని గడపంటూ లేదు. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ గునపాటి దీపక్‌రెడ్డి న్యాయస్థానాల్లో వేస్తున్న పిటిషన్లే నిదర్శనం. తాజాగా ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
దీపక్‌రెడ్డి వేసిన పిటిషన్లో వాదన ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.
మూడు రాజధానులు (అభివృద్ధి వికేంద్రీకరణ), సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మళ్లీ ప్రవేశ పెట్టడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ ఏడాది జనవరిలో శాసనసభలో ఈ రెండు బిల్లులను ఆమోదించుకున్నారని తెలిపారు. అలాగే ఆ బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ పరిశీలనకు సిఫార్సు చేసి సభను వాయిదా వేశారని, అయితే శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు చైర్మన్ ఆదేశాలను పాటించలేదని, ఇప్పటి వరకూ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో గత నెల 16న తిరిగి మళ్లీ శాసనసభలో ఈ రెండు బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకుందని పేర్కొన్నారు. ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాక మళ్లీ శాసనసభలో ఎలా ఆమోదిస్తారని దీపక్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిం చామని, హైకోర్టులో ఇప్పట్లో విచారణ జరిగే పరిస్థితి లేనందున సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇటీవల ఇదే అంశంపై దీపక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ విషయాన్ని ఆయన సుప్రీంకోర్టుకు కూడా తెలియజేశాడు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ బిల్లులపై సత్వరం స్పందించాలని ఆయన అభ్యర్థించాడు. ఎందుకంటే ఒకవేళ బిల్లుల ఆమోదాన్ని నిరోధించకపోతే ఈ నెల 14వ తేదీన ఆటోమేటిక్‌గా బిల్లులు చట్టరూపం పొందుతాయని దీపక్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
గత నెలలో మండలిలో తిరిగి ప్రవేశ పెట్టిన మూడు రాజధానులు (అభివృద్ధి వికేంద్రీకరణ), సీఆర్డీఏ రద్దు బిల్లులు ఈ నెల 14వ తేదీకి 30 రోజుల గడువు పూర్తి చేసుకుంటాయి. దీంతో నెలలోపు మండలిలో ఆమోదం లేదా తిరస్కరణ లేదా ఎలాంటి స్పందన లేకపోతే వాటంతట అవే పాస్ అవుతాయని చట్టం చెబుతోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు (అభివృద్ధి వికేంద్రీకరణ), సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలి కూడా ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది.
ఇక్కడే అసలు కథ ఉంది. రెండునెలల క్రితం విశాఖకు రాజధాని తరలిస్తున్నారని, అడ్డుకోవాలని కొందరు హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ సందర్భంగా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో బిల్లులు చట్టమైన తర్వాతే తరలింపు ప్రక్రియ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 15న కేబినెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఉందని చెప్పొచ్చు. కేబినెట్ సమావేశానికి ఒకరోజు ముందు మూడు రాజధానులు (అభివృద్ధి వికేంద్రీకరణ), సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఇటు అసెంబ్లీ, అటు మండలి వైపు నుంచి పూర్తిస్థాయిలో ఆమోదం అభించే పరిస్థితులున్నాయి.
మరోవైపు న్యాయస్థానం జోక్యం చేసుకోకపోతే రాజధాని బిల్లులకు చట్టబద్ధత లభిస్తుందని ఆందోళన చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇదే సమయంలో దీపక్‌రెడ్డి హైకోర్టులో ఇప్పట్లో విచారణ జరిగే పరిస్థితి లేనందున సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొనడం సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమే. ముఖ్యమైన కేసులను మాత్రమే టేకప్ చేస్తామని హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో….దీపక్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై వెంటనే విచారణ జరపకపోవడం గమనార్హం. మరి హైకోర్టే విచారణ జరపకపోతే సుప్రీంకోర్టు మాత్రం వెంటనే విచారణ చేపట్టి తగిన ఆదేశాలు ఇస్తుందా అనేది ఇప్పుడు చర్చనీ యాంశమైంది.
ఏది ఏమైనా ఈ నెల 14వ తేదీ నాటికి మూడు రాజధానులు (అభివృద్ధి వికేంద్రీకరణ), సీఆర్డీఏ రద్దు బిల్లులకు చట్టబద్ధత రానుంది. ఆ తర్వాత పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీస్తాయని చెప్పొచ్చు. ఆ పరిణామాలకు ఈ నెల 15న జరిగే కీలక భేటీ వేదిక అయ్యే అవకాశాలే ఎక్కువ. అందుకే ఈ కేబినెట్ భేటీ ఎంతో ప్రత్యేకం అని చెప్పడం.