ఇంటర్‌నెట్ యుగంలో పుస్తక పఠనానికి క్రమంగా కాలం చెల్లుతోందనేది అందరి నోట వినిపించే మాట. కానీ దివంగత నేత వైఎస్సార్‌పై ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకానికి వస్తున్న ఆదరణ చూస్తే ఆ అభిప్రా యాన్ని మార్చుకోవాలేమో.
వైఎస్సార్‌తో తన జ్ఞాపకాలకు విజయమ్మ అక్షర రూపం ఇచ్చారు. ఈ పుస్తకాన్ని ఎమెస్కో పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. జీవిత భాగస్వామిగా విజయమ్మ తమ అభిమాన ప్రజానాయకుడిగా ఏం చెప్పి ఉంటారో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంది. ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకాన్ని ఈ నెల 8న ఇడుపులపాయలో దివంగత నేత జయంతి నాడు ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని బహిరంగ మార్కెట్‌లో ఈ పుస్తకాన్ని విక్రయించకుండా ఆన్‌లైన్‌లో అమెజాన్ ఇండియా సంస్థ ద్వారా అమ్మకానికి పెట్టారు. మొదటి ఎడిషన్‌లో ముద్రించిన ఐదు వేల కాపీలు కేవలం ఒకే ఒక్క రోజులో అమ్ముడు పోయాయంటే వైఎస్సార్‌పై జనంలో ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే ఈ జనరేషన్‌లో పుస్తకాలు చదివే అలవాటు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఓ తెలుగు పుస్తకం ఇంతగా పాఠకాదరణ పొందడం గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు ప్రచురణకర్తలు అభిప్రాయపడుతున్నారు.
రెండో ఎడిషన్ మరో రెండు రోజుల్లో వస్తుందని ఎమెస్కో పబ్లికేషన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ పాఠకులకు అందుబాటులోకి తెచ్చేందుకు పెంగ్విన్ పబ్లికేషన్స్ ముందుకొచ్చింది. ఒక జనాదరణ ఉన్న నేత గురించి పుస్తకం వస్తే….స్పందన ఎలా ఉంటుందో ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకమే నిలువెత్తు నిదర్శనం.