ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన బీజేపీ నాయకుడు రఘునందన్‌రావుపై అత్యాచార ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన రాజారమణి మంగళవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.
అత్యాచారం కేసులో సంవత్సరాల తరబడి అవిశ్రాంతంగా పోరాడుతున్నా ఎవరూ స్పందించడం లేదని సెల్ఫీ వీడియోలో ఆమె వాపోయారు. రఘునందన్‌తో పాటు పలువురు పోలీసులు కూడా తనను వేధింపులకు గురి చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు.
అత్యాచారం కేసులో తనకు న్యాయం దక్కకపోగా వేధింపులు తప్పడం లేదన్నారు. వేధింపులకు గురిచేస్తున్న అధికారులు, ఎమ్మెల్యే రఘునందన్, ఆర్సీ పురం పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా తనకు న్యాయం లభించక విరక్తితో , నిరసనతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా బీజేపీ ముఖ్యనాయకుడితో పాటు పలువురు పోలీసులు, అధికారులపై సంచలన ఆరోపణలు చేసిన రాజా రమణి నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు. ఈమెను ఆర్సీ పురం పోలీసులు పటాన్‌చెరులోని ఓ ఆస్పత్రికి తరలించి రహస్యంగా ట్రీట్మెంట్ ఇప్పించారు. అనంతరం ఇంటికి పంపినట్టు సమాచారం.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రాజారమణి గతంలో తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. న్యాయవాది అయిన రఘునందన్‌ను కేసు విషయమై ఆశ్రయించానని, కాఫీలో మత్తు మందు కలిపి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు రాజా రమణి గతంలో ఆరోపణలు గుప్పించారు.
తనలాగే కేసుల విషయమై ఆయన దగ్గరికి వెళ్లే మహిళా క్లయింట్లను లొంగదీసుకుంటాడని ఆరోపించడం తీవ్ర సంచలనం రేకెత్తించడం తెలిసిందే. తాజాగా తనకు ఎంతకూ న్యాయం జరగలేదనే ఆవేదనతో ఆత్మహత్యా యత్నం చేయడంతో మరోసారి ఆ విషయాలన్నీ చర్చకు వచ్చాయి.