కేసీఆర్ సర్కార్ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ సర్కార్ సిద్ధం కావడం ప్రస్తుత పరిస్థితుల్లో సాహసమనే చెప్పాలి. గ్రేటర్ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా ఎన్నికల నగారా కూడా మోగింది.
దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి కారణంగా వెంటనే గ్రేటర్ ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ సర్కార్ ముందుకు రాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటి ప్రచారాన్ని తిప్పి కొడుతూ ప్రతిపక్షాలకు సవాల్ విసరడం గమనార్హం.
డిసెంబర్ ఒకటిన గ్రేటర్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తాజాగా షెడ్యూల్ ప్రకటించారు. ఈ షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉప సంహరణ ఉంటుంది.
అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను కూడా ప్రకటిస్తారు. అలాగే ఏదైనా అసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్, 4న ఓట్లు లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నట్టు ఎస్ఈసీ తెలిపారు.
గత నెలలో ఎన్నడూ లేనంతగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో నగరాన్ని వరద ముంచెత్తింది. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణం. నగరంలో వరదలకు కొందరు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
రోజుల తరబడి వరద నీటిలో బిక్కుబిక్కుమని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అని గడిపారు. ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు తమ వైపు కళ్లెత్తి చూడలేదని కొందరు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను నగర వాసులు చుట్టుముట్టి తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించడం చూశాం.
ఈ నేపథ్యంలో తమపై నగర వాసులు కత్తులు నూరుతున్నారనే విషయం తెలిసినప్పటికీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించుకోవడం సాహసమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి టీఆర్ఎస్‌కు నైతికంగా , మానసికంగా పెద్ద దెబ్బే. ఇదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది. గ్రేటర్‌లో కూడా అదే దూకుడు ప్రదర్శించి గోల్కొండలో జెండా ఎగుర వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమాగా చెబుతున్నారు.
ఎలాగైనా గ్రేటర్‌లో తిరిగి తమ పట్టు నిలుపుకోవాలని అధికార పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. గ్రేటర్ ఎన్నికల బాధ్యతను మంత్రి కేటీఆర్ తన భుజాన వేసుకున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో , రేపటి నుంచి హైదరాబాద్‌లో జాతరే జాతర అని చెప్పక తప్పదు.