టాలీవుడ్ హీరో రామ్‌కు మద్దతుగా కులపెద్ద నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఇటీవల చంద్రబాబునాయుడు అందరి వాడి నుంచి కొందరి వాడిగా మారారు. రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబుకు మైండ్ పనిచేస్తున్నట్టు లేదని ఆయన రాజకీయ ఎత్తుగడలపై విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోతే….ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా చేయకపోవడం విమర్శలకు దారి తీసింది.
సదరు కోవిడ్ సెంటర్‌ను తన సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రమేశ్ నిర్వహిస్తుండడం, అదే ఆస్పత్రి గుంటూరు మెయిన్ బ్రాంచ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సేద తీరుతున్న విషయం తెలిసిందే. అలాగే కరోనాపై చంద్రబాబు వైద్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డాక్టర్ రమేశ్ ఏపీ సర్కార్‌పై దుమ్మెత్తి పోయడం తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తనకు కులం కంటే మరేదీ ప్రాధాన్య అంశం కాదన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్‌పై టాలీవుడ్ హీరో, డాక్టర్ రమేశ్ సమీప బంధువు పోతినేని రామ్ ఘాటుగా ట్వీట్లు చేశాడు. ఈ ట్వీట్లపై విజయవాడ ఏసీపీ సున్నితంగా హెచ్చరించారు. విచారణను ప్రభావితం చేసేలా ట్వీట్లు పెడితే నోటీసులు ఇస్తామని హీరో రామ్‌ను ఏసీపీ హెచ్చరించారు. ఏసీపీ హెచ్చరికలపై కులపెద్ద చంద్రబాబునాయుడు ఘాటుగా ట్వీట్ చేశారు.
విజయవాడ ఏసీపీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని బాబు పేర్కొన్నారు. ట్వీట్లు పెట్టడం వల్ల విచారణకు అడ్డుపడినట్టుగా భావించి నోటీసులు ఇస్తామని బెదిరించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఏ విధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో రుజువని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తు న్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు.
అగ్ని ప్రమాదంపై స్పందించని చంద్రబాబు…తన సామాజిక వర్గానికి చెందిన హీరో ట్వీట్లపై ఏసీపీ స్పందించడాన్ని రాజకీయం చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి దుర్ఘటనకు బాధ్యులైన వారిపై ట్వీట్ చేయడానికి ఏ భావ ప్రకటనా స్వేచ్ఛ అడ్డు వచ్చిందో చెప్పు చంద్రబాబు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.