మామూలుగా అయితే వీకెండ్ కు కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ లు హైదరాబాద్ కు చేరినట్టుగా వార్తలు వచ్చేవి కావు. ప్రతిపక్షంలోకి పడ్డాకా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లు వారాంతాల్లో హైదరాబాద్ కు రావడం జరుగుతున్నట్టుగా ఉంది. ఐదు రోజుల పాటు అమరావతి ప్రాంతంలో ఉండటం, రెండు రోజుల విరామానికి హైదరాబాద్ కు చేరడం వారి వారచర్యగా కొనసాగుతూ వచ్చింది.
చంద్రబాబు నాయుడి కుటుంబం కేరాఫ్ హైదరాబాద్ గానే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడో ముంబైలో ఉన్న వాళ్లు అమరావతికి రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు తన కుటుంబాన్ని మాత్రం హైదరాబాద్ దాటించలేకపోయారు. అమరావతి వైపు ప్రపంచమంతా చూస్తోందని ప్రకటించిన ఆయన తన కుటుంబం మాత్రం హైదరాబాద్ లోనే ఉండేలా చూసుకున్నారు! తను ఒక్క సారి అరిస్తే హైదరాబాద్ నుంచి అంతా వెళ్లిపోతారని, హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ పడిపోతుందని సైతం హెచ్చరించిన ఆయన ప్రతిపక్ష నేత అయ్యాకా వారం వారం హైదరాబాద్ వెళ్లి వస్తూ ఉన్నారు!
ఆ సంగతులన్నీ అలా ఉంటే.. ఈ వారంలో మాత్రం గురువారమే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ మీద ఐటీ రైడ్స్, ఇతర తెలుగుదేశం పార్టీ నేతల కాంట్రాక్టు సంస్థల మీద ఐటీ రైడ్స్.. రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులను ఐటీ గుర్తించిందనే వార్తల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరడం గమనార్హం. ఆయనతో పాటు ఆయన తనయుడు లోకేష్ కూడా హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తోంది. శనివారం హైదరాబాద్ చేరాల్సిన వీళ్లు గురువారమే చేరడం వెనుక.. ఐటీ రైడ్సే కారణం అనే అభిప్రాయాలు సహజంగానే వినిపిస్తున్నాయి. తన సన్నిహిత లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లతో చంద్రబాబు నాయుడు చర్చలు జరుగుతూ ఉన్నారని.. తర్జనభర్జనలు కొనసాగుతూ ఉన్నాయని టాక్!