దొరికింది ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్! 2014 నుంచి 2019 మధ్యన సీఎం పర్సనల్ సెక్రటరీగా పని చేసిన ఒక వ్యక్తి వద్ద భారీగా అక్రమాస్తులు బయటపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకు సదరు నేతతో దగ్గరి బంధుత్వం కూడా ఉందని సమాచారం. అలాంటి వ్యక్తి వద్ద భారీగా అక్రమాస్తులు చిక్కడమే పెద్ద విశేషం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పని చేసిన వ్యక్తి వద్ద భారీగా అక్రమాస్తులు బయటపడితే చంద్రబాబుకు సంబంధం ఉండదా?
సీఎం పీఎస్ గా పని చేసిన వ్యక్తి అక్రమాస్తులు కూడబెడితే దానికి సీఎం బాధ్యత ఉండదా! నిజంగానే చంద్రబాబు నాయుడు అంత అమాయక చక్రవర్తి అనుకుందాం. అలాంటప్పుడు ఆయన దగ్గర పని చేస్తున్న వ్యక్తి సంపాదిస్తుంటే.. చంద్రబాబు వంటి నాయకుడు ఏం చేసినట్టు? తన చుట్టూ ఉన్న వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోతే ఆయనేం నాయకుడు!
ఇక పాయింట్ నంబర్ టూ.. ఐటీ రైడ్స్ లో వినిపించిన తెలుగుదేశం నేతలు ఏమీ అల్లాటప్పా వారు కాదు. నారా లోకేష్ సన్నిహితులు కొందరు. ప్రైవేట్ టూర్స్ లో కూడా నారా లోకేష్ తో వారు దిగిన ఫొటోలు టీవీల్లో ప్రదర్శితం అవుతున్నాయి. అలాగే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి సంస్థల్లో కూడా ఈ బొక్కలు బయటపడినట్టుగా వార్తలు వస్తున్నాయి!
అయినా..ఇదంతా తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారం. ఏ సంబంధం లేకపోయినా ఈ వ్యవహారాల గురించి చంద్రబాబు తర్జనభర్జనలు పడుతూ ఉన్నారు! తెలుగుదేశం నేతలు ఎక్కడిక్కడ కలుగులో దాక్కున్నారు! ఒక్క యనమల రామకృష్ణుడు మాత్రం ఈ వ్యవహారాలతో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని తేల్చారు!
నిజమే, ఎక్కడో పనామా పత్రాలు బయటకు వస్తే వాటికీ, జగన్ కు తెలుగుదేశం పార్టీ ముడేస్తుంది. మరెక్కడో ఎవరో దాత తన ఆస్తులన్నీ ప్రజలకు ఇస్తే జగన్ కూడా అలా చేయాలని తెలుగుదేశం ఉచిత సలహాలు ఇస్తుంది. ఇంకెక్కడో ఇంకేదో జరిగితే.. దానికీ, జగన్ కు సంబంధం కలుపుతుంది పచ్చ పార్టీ. అదే చంద్రబాబు నాయుడు పీఎస్ దగ్గర, లోకేష్ పాలేర్ల దగ్గర, తెలుగుదేశం నేతల దగ్గర అక్రమాస్తులను ఐటీ గుర్తిస్తే మాత్రం.. వాటికీ చంద్రబాబుకు సంబంధం లేదు. మరింత కామెడీ ఏమిటంటే.. చంద్రబాబు ఈ అంశాల గురించి ఏం స్పందిస్తారని అంతా చూస్తుంటే.. యనమల మాత్రం కోర్టులో సీబీఐ చార్జిషీట్ గురించి జగన్ స్పందించాలని రొటీన్ కామెడీ చేశారు. ఇదీ పచ్చపురాణం. పుచ్చిపోయిన పచ్చపురాణం!