భారతీయజనతా పార్టీ, జనసేన మధ్య పొత్తు బంధం ఉండవచ్చు గాక! కానీ.. ఒక పార్టీ నేతలు మరొకరిని ‘ఆశ్రయించి’ సమస్యల పరిష్కారానికి విన్నవించుకోవడం చిత్రమైన పరిణామం. పొత్తు ఉన్న పార్టీలు.. కలిసి పోరాడుతాయి.. కలిసి ఉద్యమాలు చేస్తాయి.. అంతే తప్ప.. ఒకరినొకరు ఆశ్రయించడం జరగదు. మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది.. మీరు దీని మీద పోరాడండి.. అని దేబిరించడం ఉండదు. అలా జరిగితే అడిగే పార్టీ యొక్క బలహీనత, చేతగానితనం అనిపించుకుంటుంది. కానీ.. మర్మం ఏమిటో తెలియదు గానీ.. కమలనేతలు తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి జనసేనాని వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు..!
సుగాలి ప్రీతి విషయంలో పవన్ కల్యాణ్ పోరాటం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి హత్యాచారం కేసును సీబీఐకు అప్పగించకపోతే గనుక.. తాను స్వయంగా మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేస్తానని పవన్ వెల్లడించారు. అయితే ఆ తర్వాత.. అదే జిల్లానుంచి మరో అత్యాచారం కేసు కూడా పవన్ దృష్టికి వచ్చింది. ఆరేళ్ల బాలికను నలభయ్యేళ్ల వ్యక్తి అత్యాచారం చేసినట్లుగా స్థానిక భాజపా నాయకురాలు పవన్ దృష్టికి తెచ్చారు. ఆ సమస్యపై ఆయనను పోరాడాల్సిందిగా కోరడం జరిగింది.
కర్నూలులోని బండిమెట్ట ప్రాంతంలో.. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న తల్లదండ్రుల్లేని ఆరేళ్ల అమ్మాయిపై , ఖాజా మొహినుద్దీన్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడనేది ఆరోపణ. పోలీసులకు కంప్లయింటు ఇస్తే బలహీనమైన సెక్షన్ల కింద నమోదు చేశారనేది భాజపా ఆరోపణ. దీనిపై స్థానిక బీజేపీ నాయకురాలు వినీషారెడ్డి పవన్ కల్యాణ్ ను కలిశారు. వివరాలు తెలుసుకున్న తర్వాత.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని, మహిళా కమిషన్ తక్షణం స్పందించాలని పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆరేళ్ల అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడానికి భాజపా నిజంగానే చిత్తశుద్ధితో ఉంటే గనుక, వారి పార్టీ తరఫునే రాష్ట్ర నాయకులను పిలుచుకు వచ్చి అక్కడ ఆందోళన కార్యక్రమాలను చేసి ఉండవచ్చు. అలాకాకుండా.. పవన్ కల్యాణ్ ను ఆశ్రయించడం కమల దళ:లోనే పలువురికి కంటగింపుగా ఉంది. పవన్ దగ్గరకు వెళ్లినంత మాత్రాన.. ఆయన ఓ ప్రెస్ నోట్ ఇవ్వడం మినహా ఇంకేం చేయగలరు! అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.