అప్పుడు గన్యా.. ఇప్పుడు కరోనా.. ‘ఈనాడు’ తిప్పలు

కరోనా భయంతో రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో చికెన్ కి డిమాండ్ విపరీతంగా పడిపోయింది. నాన్ వెజ్ ప్రియులు చేపలు, రొయ్యలు అంటూ పక్కచూపులు చూస్తున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో…

కరోనా భయంతో రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో చికెన్ కి డిమాండ్ విపరీతంగా పడిపోయింది. నాన్ వెజ్ ప్రియులు చేపలు, రొయ్యలు అంటూ పక్కచూపులు చూస్తున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడిపోయింది. చివరకు ఈనాడుకి కూడా తిప్పలు తప్పలేదు. ఈనాడు యాజమాన్యంతో సంబంధం ఉన్న చాలామంది పౌల్ట్రీ రంగంలో ఉన్నారు.

పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగా కూడా పౌల్ట్రీతో రామోజీ గ్రూపుకి సంబంధాలున్నాయి. అందుకే.. చికెన్ వాడకంపై ఎలాంటి ప్రచారాలు వచ్చినా వెంటనే ఈనాడు భుజాలు తడుముకుంటుంది. వరసబెట్టి వార్తల్ని వండి వారుస్తుంది. గతంలో చికెన్ గున్యా వ్యాధి తొలిసారి రాష్ట్రంలో ప్రబలినప్పుడు.. ఈనాడు పడ్డ ఆపసోపాలు అన్నీ ఇన్నీ కావు. మిగతా పత్రికలన్నీ చికెన్ గున్యా అని రాస్తే, ఈనాడులో మాత్రం గన్యా అని మాత్రమే అచ్చయ్యేది. సబ్ ఎడిటర్లందరికీ గన్యా అని మాత్రమే రాయాలని, చికెన్ అనే పదం ఎక్కడా రాయొద్దని ఆదేశాలు కూడా వెళ్లాయి.

అప్పట్లో అలా కవర్ చేశారు కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని కరోనా వైరస్ పై ఈనాడు పప్పులు ఉడకడం లేదు. వాట్సాప్ గ్రూపుల్లో చికెన్ తో కరోనా ముప్పు ఉందని తిరుగుతున్న వార్తల్ని చూసి చాలామంది భయపడుతున్నారు. అది ఫేక్ న్యూసో కాదో పక్కన పెడితే, కరోనా భయం పోయే వరకు చికెన్ తినకపోతే వచ్చిన నష్టమేమీ లేదని, దానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారంతా. దీంతో ఈనాడు మళ్లీ రంగంలోకి దిగాల్సిన అవసరం వచ్చింది.

నాలుగు రోజులుగా వరుసబెట్టి చికెన్ కి కరోనాకి సంబంధం లేదని కథనాలిస్తున్న ఈనాడు.. రోజు రోజుకీ మోతాదు పెంచుకుంటూ పోతోంది. కేంద్ర మంత్రుల స్పందనను, కేంద్రం జారీ చేసిన ప్రకటనలను అచ్చు వేస్తూ చికెన్ తో చిక్కులేదంటూ కథనాల్ని ఇస్తోంది. పౌల్ట్రీ రైతుల కష్టాల్ని ఏకరువు పెడుతూ.. చికెన్ పై దుష్ప్రచారం జరుగుతోందంటూ కన్నీరు కారుస్తోంది.

చికెన్ పై జరుగుతున్న దుష్ప్రచారాలపై సైబర్ పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయట. ముందు ముందు ఈ కథనాలు ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతాయో చూడాలి. మొత్తమ్మీద.. అప్పట్లో గన్యా, ఇప్పుడు కరోనాని.. ఈనాడు కవర్ చేయలేక ఇబ్బంది పడుతోంది.

రష్మిక కుక్క బిస్కెట్లు తింటుంది డైలీ