తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అఖండ సినిమాను వదలదలుచుకోనట్టుగా ఉంది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా చాలా బాగుందని చంద్రబాబు నాయుడు ప్రశంసిచారు. ప్రశంసించడమే కాదు.. దీనికీ, రాజకీయానికీ ఆయన ముడి పెట్టారు.
ఏపీలో ప్రస్తుత స్థితి అఖండ సినిమాలో చూపినట్టుగా ఉందట! ఇదీ చంద్రబాబు ఈ సినిమా గురించి చేసిన విశ్లేషణ. ఇలా బాలకృష్ణ సినిమాను చంద్రబాబు నాయుడు రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేశారు. అయినా చంద్రబాబు నాయుడు ఇలాంటి అవకాశాలను వదులుకుంటే అది ఆశ్చర్యం కానీ, వాడుకుంటే వింత లేకపోవచ్చు.
ఇది వరకూ ఎన్టీఆర్ బయోపిక్ సెకెండ్ పార్ట్ విడుదలైనప్పుడు చంద్రబాబు నాయుడు ఇలానే మాట్లాడారు. తనంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఎన్టీఆర్, ప్రజానాయకుడు సినిమాను చూడాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు కామెడీ చేశారు.
ఆ సినిమాలో నాదెండ్ల వెన్నుపోటు వ్యవహారంలో ఎన్టీఆర్ ను తిరిగి పీఠంపై కూర్చోబెట్టిందంతా చంద్రబాబే అనట్టుగా చూపిన వైనాన్ని చంద్రబాబు తన గొప్పదనానికి అది నిదర్శనం అని చెప్పుకున్నారు.
అయితే ఆ తర్వాత నాదెండ్ల కన్నా విజయవంతంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది తనే అని ప్రజలు మరిచిపోయారని చంద్రబాబు అనుకున్నారేమో!
అయితే.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు హీరోయిజం గురించి అంతలా చూపినా.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పుడు ఆ సినిమా విడుదలైనా ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు. అయినా.. చంద్రబాబు సినిమాలతో వాస్తవ పరిస్థితులను ముడిపెట్టే కామెడీని మాత్రం ఆపడం లేదు!