చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని మరోసారి రుజువైంది. జగన్ ని కార్నర్ చేసే సబ్జెక్ట్ లు, సందర్భాలు దొరక్క, పాచిపోయిన వ్యవహారాలన్నిటినీ తెరపైకి తెస్తున్నారు. తాజాగా హోదా కోసం రాజీనామా అనే డ్రామా మొదలుపెట్టారు. అయితే ఇక్కడే చంద్రబాబు పప్పులో కాలేస్తున్నారు.
2014 నుంచి 2019 వరకు నాలికను అష్టవంకర్లు తిప్పి హోదా, కాదు ప్యాకేజీ, కాదు హోదా, కాదు ప్యాకేజీయే కావాలంటూ అబద్దాలు చెప్పుకుంటూ వచ్చిన బాబుకి ఇప్పుడు హోదా ఎందుకు గుర్తొచ్చిందని, దాని కోసం రాజీనామాలేంటనే ప్రశ్నలు వినపడుతున్నాయి. జగన్ ని హోదా కోసం వేలెత్తి చూపితే నాలుగు వేళ్లు బాబుని వెక్కిరిస్తుంటాయి. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగింది.
పాచిపోయిన లడ్డూ..
ప్యాకేజీ అనేది పాచిపోయిన లడ్డూలాంటిదని గతంలో పవన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడా పాచిపోయిన లడ్డూ కూడా లేకుండా చేసినా.. పవన్ ఎప్పుడూ నోరు తెరిచి కేంద్రాన్ని ప్రశ్నించిన పాపాన పోలేదు.
అప్పట్లో ప్యాకేజీని పరమాన్నంగా చెప్పుకున్న బాబు ఆ తర్వాత మాటమార్చారు. హోదాయే కావాలన్నారు. ఇప్పుడు కూడా జగన్ భుజంపై తుపాకి పెట్టి కేంద్రాన్ని టార్గెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు బాబు. అందుకే రాజీనామాస్త్రాలను బయటకు తీస్తున్నారు.
కానీ హోదా అనేది పాచిపోయిన టాపిక్. ఇప్పుడా ప్రతిపాదనని తెరపైకి తేవడం కూడా వృథా ప్రయాసే. ఎంపీలంతా తల్లకిందులుగా తపస్సు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. అసలే ఆర్థిక కష్టాలు, అందులో పక్క రాష్ట్రాల నుంచి హెవీ కాంపిటీషన్ ఉంది. ఈ రెండూ చాలు.. కేంద్రం తన నిర్ణయాన్ని కరాఖండిగా చెప్పడానికి.
తన గొయ్యి తానే..
చంద్రబాబు ఎప్పుడూ తన గొయ్యి తానే తవ్వుకుంటూ ఉంటారు. ఇప్పటికే దాదాపు 90 శాతం తన రాజకీయ సమాధి కోసం గొయ్యి తవ్వేసుకున్నారు. ఇక మిగిలిన 10శాతం పని కూడా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటప్పుడే ఇలాంటి ఆలోచనలు ఆయనకు వస్తుంటాయి.
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం మా ఎంపీలను ఢిల్లీకి పంపించండి అని జగన్ అడిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఏపీకి ఉన్న ఎంపీలు కాదు కదా.. మొత్తం దక్షిణాది ఎంపీలంతా కలసి ఏపీ ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా కేంద్రంలో ఉన్న బీజేపీ మెత్తబడే అవకాశం లేదు.
అప్పట్లో తెలంగాణ ఇస్తే రాజకీయ లాభం ఉంటుందని ఆశించి కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా.. ఇక్కడ బీజేపీకి సింగిల్ ఎమ్మెల్యే సీటు కూడా రాదని ఆ పార్టీకి బాగా తెలుసు. అందుకే హోదా అనేది అసాధ్యం అని తేలిపోయింది. అలాంటి ఔట్ డేటెడ్ సబ్జెక్ట్ ని తెరపైకి తెచ్చి పొలిటికల్ పులిహోర కలిపేస్తున్నారు చంద్రబాబు.