వైసీపీకి కేంద్రం తీపి క‌బురు

వైసీపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు పంపింది. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు ఇత‌ర విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఈ నెల 17న చ‌ర్చ‌ల‌కు రావాల‌ని కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపింది. కేంద్ర…

వైసీపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు పంపింది. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు ఇత‌ర విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఈ నెల 17న చ‌ర్చ‌ల‌కు రావాల‌ని కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపింది. కేంద్ర హోంశాఖ ఎజెండాలో ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా అంశాన్ని చేర్చ‌డంపై వైసీపీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు విభ‌జ‌న హామీల‌ను వెంట‌నే నేర‌వేర్చాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొద‌టి నుంచి డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు మంత్రులు, వైసీపీ పార్ల‌మెంట్ స‌భ్యులు ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు సంబంధిత మంత్రుల‌కు ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేశారు.

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల‌ను ఎట్ట‌కేల‌కు ఫ‌లించిన‌ట్టే క‌నిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ నేతృత్వంలోని ఏపీ, తెలంగాణ ఉన్న‌తాధికారుల‌తో త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటైంది. ఈ క‌మిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావ‌త్‌, తెలంగాణ నుంచి రామ‌కృష్ణారావు ఉన్నారు.

ఈ నెల 17న వీడియో కాన్ఫ‌రెన్స్‌ ద్వారా స‌మావేశ‌మై చ‌ర్చించాల్సిన 9 అంశాల‌ను గుర్తించారు. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన, ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్‌ వినియోగ సమస్య, పన్ను అంశాలపై తలెత్తిన వివాదాలు, రెండు రాష్టాలకు సంబం ధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు, ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ మధ్య నగదు ఖాతాల విభజన, ఏపీ- తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా,  రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలపై చ‌ర్చించి ప‌రిష్కారాల‌ను చూప‌నున్నారు.  

ముఖ్యంగా ప్ర‌త్యేక హోదాపై వైసీపీ స‌భ్యులు ప‌ట్టుబ‌డుతున్నారు. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయ‌ని, త‌ద్వారా ఆర్థిక ప‌రిస్థితి మెరుగ‌వుతుంద‌ని వైసీపీ వాదిస్తోంది. ఈ నేప‌థ్యంలో ముగిసిపోయిన అధ్యాయంగా ఇంత కాలం చెబుతూ వ‌స్తున్న కేంద్ర ప్ర‌భుత్వం… ఎజెండాలోని 9 అంశాల్లో ప్ర‌త్యేక హోదాన్ని చేర్చ‌డం ఏపీ ప్ర‌భుత్వానికి , వైసీపీకి కొండంత ఉత్సాహాన్ని ఇస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ఇస్తే మాత్రం జ‌గ‌న్ ఇమేజ్ పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.