కోవిడ్ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశించిన విధంగా కోవిడ్ మృతుల కుటుంబాలకు జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి ఎక్స్గేషియో చెల్లించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా అని బుధవారం రాజ్యసభలో వైస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
గౌరవ్ కుమార్ బన్సాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఈ ఏడాది జూన్ 30న సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపై మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ)ను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ అంశంపై భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
కోవిడ్ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన అనంతరం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి క్వారంటైన్, కంటైన్‌మెంట్, శాంపిల్ కలెక్షన్, స్క్రీనింగ్, అవసరమైన మెడికల్ ఎక్విప్‌మెంట్ కోనుగోలు కోసం ఎస్‌డీఆర్‌ఫ్ నిధుల వినియోగానికి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అనుమతించినట్లు మంత్రి తెలిపారు.
అలాగే వలస కార్మికుల కోసం సహాయ శిబిరాల ఏర్పాటు, వారికి ఆహార ఏర్పాట్లు, నిరాశ్రయలు, లాక్‌డౌన్ కారణంగా చిక్కుబడిపోయిన వలస కార్మికులను ఆదుకునేందుకు కూడా ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల వినియోగానికి అనుమతించినట్లు చెప్పారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ వార్షిక బడ్జెట్‌లో 50 శాతం నిధులు వాడుకోవడానికి అనుమతించడం జరిగింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులలో కేంద్ర వాటా కింద 2019-20లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 10,532 కోట్లు విడుదల చేయగా 2020-21లో ఈ మొత్తాన్ని 22,262 కోట్లకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
గడిచిన 16 నెలల వ్యవధిలో వంట గ్యాస్ ధరను 13 సార్లు సవరించినట్లు పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ రాజ్యసభకు తెలిపారు. మార్చి 2020 నుంచి ప్రభుత్వ ఎన్నిసార్లు వంట గ్యాస్ ధరను సవరించింది, ఎంత మొత్తం పెంచిందని వైఎస్సార్సీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మంత్రి ఈ విషయం వెల్లడించారు. 2020 మార్చిలో సబ్సిడీపై సరఫరా చేసే గ్యాస్ సిలెండర్ ధర 805 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 834 రూపాయలకు చేరినట్లు చెప్పారు.
దేశంలో పెట్రోలియం ఉత్పాదనల ధరలను అంతర్జాతీయ మార్కెట్ ధరలను అనుసరించి నిర్ణయించడం జరుగుతుంది. సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేసే వంట గ్యాస్ ధరను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సబ్సిడీ లేని వంట గ్యాస్ ధరను మాత్రం అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 2019-20లో 23 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ రీఫిల్స్ విక్రయించగా 2020-21లో ఈ సంఖ్య 35 కోట్లకు చేరిందని మంత్రి వెల్లడించారు.