ఇన్నాళ్లూ అమరావతి వాసుల్ని మభ్యపెట్టాలని చూశారు. పోరాటాలు చేయండి, పోయేదేం లేదు, రోడ్డెక్కండి, మీ రాజధాని మీకొస్తుందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఇప్పుడు తెలివిగా తప్పుకున్నారు చంద్రబాబు. కేవలం రాజధాని ప్రాంత నాయకులను మాత్రమే అమరావతి రైతుల వద్దకు పంపించి మద్దతు తెలిపేలా వ్యూహ రచన చేశారు.
అమరావతి వల్ల చంద్రబాబు వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు లాభపడి ఉండొచ్చు కానీ రాజకీయంగా ఆయనకు ఒరిగిందేమీ లేదు. నిజంగానే అక్కడ అభివృద్ధి చేసి ఉంటే.. కనీసం ఆ ప్రాంతంలో అయినా టీడీపీ జెండా ఎగిరి ఉండేది. కానీ అది జరగలేదు. అలాంటి రిజల్ట్ ఇచ్చిన అమరావతి కోసం అత్యథిక అసెంబ్లీ సీట్లు ఇచ్చిన విశాఖను దూరం చేసుకోవడం చంద్రబాబుకి ఇష్టంలేదు.
అయితే కొన్నాళ్లు మాత్రం అమరావతిపై లేనిపోని ప్రేమ ఒలకబోశారు. కేంద్రాన్ని కూడా ఇందులోకి లాగాలని చూశారు. రాష్ట్ర బీజేపీతో చీవాట్లు తిన్నారు. ఇంతా జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచనలో లేకపోవడంతో చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశారు.
గతంలో అమరావతి ఉద్యమం 100, 150, 200 రోజులకి చేసిన హడావిడి 250వ రోజు బాబు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కనపడలేదు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలోని ఇతర సమస్యలన్నిటినీ ప్రస్తావించిన బాబు అమరావతిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే వదిలేశారంటేనే.. విషయం అర్థమవుతోంది.
అమరావతి కోసం ఇక నేరుగా చంద్రబాబు మాట్లాడరు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడంపైనే ఇక బాబు ఫోకస్ అంతా. అధికార పక్షం తెలివిగా తనను అమరావతికి పరిమితం చేస్తోందన్న విషయాన్ని ఇన్నాళ్లకు గ్రహించారు బాబు. వచ్చే ఎన్నికల వరకూ అమరావతిని పట్టుకుని ఊరేగితే.. ఎలక్షన్ హామీగా ఒకే రాజధాని అని చెప్పాల్సి వస్తుందని, అది టీడీపీని భూస్థాపితం చేసే నిర్ణయమేనని బాబుకి బాగా తెలుసు.
అందుకే కృష్ణా-గుంటూరు జిల్లాల టీడీపీ నేతల్ని మాత్రం అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు వినియోగిస్తున్నారు. తాను పూర్తిగా మిగతా రాజకీయాలపై దృష్టిపెట్టారు. అలా అమరావతి నుంచి వ్యూహాత్మకంగా పక్కకు వచ్చేశారు చంద్రబాబు. అయినా ఓ వ్యక్తిని లేదా విషయాన్ని తనకు అనుకూలంగా ఉన్నంతవరకు వాడుకోవడం, తర్వాత దాన్ని గాలికి వదిలేయడం బాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య కదా.