సాధారణంగా టాప్ హీరోలు ఆచి తూచి అడుగేస్తారు. డైరక్టర్ల కథలు వింటూనే, కరెక్షన్లు చెబుతూనే ఫైనల్ వరకు తీసుకువస్తారు. కానీ ఎవరికి సినిమా చేద్దాం అన్నది అంత సులువుగా క్లారిటీ ఇవ్వరు. ఓ పక్క కమిట్ మెంట్లు ఎవరికి వున్నాయి? ఎవరికి చేస్తే బెటర్ అన్న విషయాలు మాట్లాడుతూనే వుంటారు కానీ తమ మనసులో మాట బయటకు రానివ్వరు.
లేటెస్ట్ గా ఓ గ్యాసిప్ ఇండస్ట్రీలో ఇలాగే వినిపిస్తోంది. అది మెగాస్టార్-బాబీ సినిమాకు సంబంధించింది. డైరక్టర్ బాబీ ఓ కథను మెగాస్టార్ కోసం తయారు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ సంస్థకు చేయాలన్నది బాబీ ఆలోచన. ఎందుకంటే ఆయనకు అక్కడ కమిట్ మెంట్ వుంది. పైగా ఈ ప్రాజెక్టును బాబీకి-మెగాస్టార్ కు మధ్య సెట్ చేసిన 'పెద్దాయిన' కు మైత్రీతో మైత్రీ బంధాలు వున్నాయి. అక్కడయితే ప్రాజెక్టులో ఓ పావలా షేర్ తీసుకోవచ్చు. పెట్టుబడి కూడా అక్కరలేదు.
ఇలాంటి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం బాబీకి మెగాస్టార్ టీమ్ నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికీ చెప్పకుండా రమ్మని, వచ్చి స్క్రిప్ట్ అప్ డేట్ ఇవ్వమని ఆ కాల్ సారాంశంగా తెలుస్తోంది. కానీ బాబీ మాత్రం ఈ విషయం తనకు సినిమా సాయం చేస్తున్న 'పెద్దాయిన' చెప్పి వెళ్లినట్లు బోగట్టా.
మెగాస్టార్ స్క్రిప్ట్ అప్ డేట్ విన్నారు. ఆయన సజెషన్స్ చెప్పారు. అలాగే అంతా అయ్యాక, ఎవరి చేద్దాం అన్నది తాను చూసుకుంటాను అని కుండబద్దలు కొట్టినట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది. బాబీ ఈ సమయంలో మైత్రీ పేరు చెప్పినా, తనకు వదిలేయమని, తాను చూసుకుంటా అని మెగాస్టార్ చెప్పారని తెలుస్తోంది.
దాంతో బాబీ వెనక్క వచ్చి తన 'పెద్దమనిషి' కి విషయం వివరించినట్లు, సరే, తాను చూసుకుంటా అని ఆయన అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తుంటే మెగాస్టార్ కు డైరక్టర్ బాబీతో సినిమా చేసే ఉద్దేశం వుంది కానీ, నిర్మాత విషయంలో ఆయన ఐడియాలు ఆయనకు వున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ఎంతయినా అనుభవం పండిన సీనియర్ హీరో కదా..అంత సులువుగా బయటకు తేల్తారా?