ఈమధ్య మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వయసు గురించి తరచుగా మీడియాలో ప్రస్తావనకు వస్తోంది. గతంలో కూడా వచ్చిందనుకోండి. కాని ఆయన పార్టీ ఘోర పరాజయం తరువాత బాబు వయసుపై ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆయన ఇక ఎంతకాలం రాజకీయ రంగంలో ఉంటారనే ప్రశ్న ఎదురవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బాబు పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించినా లేదా స్వల్ప తేడాతో ఓడిపోయినా ఆయన వయసు మీద చర్చ జరిగేది కాదేమో. కాని ఘోర పరాజయం కారణంగా ఆయన ఇంకా ఎంతకాలం రాజకీయాలు చేయగలుగుతారనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయ నాయకులు సామాన్య ప్రజల్లా ఉద్యోగం నుంచి రిటైర్ కాగానే విశ్రాంతి దొరికిందని కృష్ణా.. రామా అనుకుంటూ, మనుమలు, మనుమారాళ్లతో ఆడకుంటూ కూర్చోరు. దశాబ్దాలుగా జనంలో ఉన్నవారు, అధికారాన్ని అనుభవించినవారు వయసు పెరుగుతున్నా లెక్కచేయరు. అలవికాని అనారోగ్య సమస్యలు వస్తే తప్ప ప్రజాజీవితం నుంచి తప్పుకోరు.
చంద్రబాబుకు ప్రస్తుతం 69 ఏళ్లు. వచ్చే ఎన్నికలనాటికి దాదాపు 75 ఏళ్లు వస్తాయి. అప్పటికి ఆయన శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. మొన్నటి ఎన్నికల్లో ఆయన గెలిచి అధికారం చేపట్టివుంటే ఉత్సాహం ఉరకలేసేది. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నా, తనవంతు పాత్ర పోషిస్తున్నప్పటికీ ఓటమి బాధ నుంచి ఆయన ఇంకా తేరుకోలేదనేది స్పష్టంగా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చెప్పాలంటే చాలామంది నాయకులకంటే బాబు ఆరోగ్యంగానే ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఎలావుందన్నది పక్కన పెడితే అయిదేళ్లూ చాలా చురుగ్గా ఉన్నారు. తీరికలేని పర్యటనలు చేసినా, గంటల తరబడి సమీక్షా సమావేశాలు నిర్వహించినా ఆయన ఆరోగ్యం దెబ్బతిన్న దాఖలాలు లేవు. ఆహారం విషయంలో ఆయన క్రమశిక్షణ మెచ్చుకోదగింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా వయసు పెరుగుతుంటే సహజంగానే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటివరకైతే బాబు తీవ్రంగా అనారోగ్యం పాలైన దాఖలాలు లేవు. శారీరకంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా మానసిక సమస్యలుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఇప్పుడు చంద్రబాబుకు ఉన్నది మానసికమైన ఆందోళనే. ఆయనకు దివంగత రాజశేఖరరెడ్డి బద్ధశత్రువు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాబు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు వైఎస్సార్ కుమారుడు జగన్ అధికారంలోకి రావడంతో మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ అధికారంలో ఉండి, బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటి పరిస్థితి వేరు. వారిద్దరు సమకాలికులు. దాదాపు ఒకే వయసువారు. ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇద్దరూ ఒకే పార్టీలో చేరినా కాలక్రమంలో దారులు వేరయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇద్దరూ మంచి మిత్రులు కూడా. అసెంబ్లీలో, బయటా ఇద్దరూ పరస్పరం విమర్శలు చేసుకున్నా సమవుజ్జీలుగా ఉండేవారు. ఆ కథ ముగిసిపోయి బాబు ఊహించనివిధంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు.
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలుకు వెళతాడనుకున్న జగన్ అధికార పీఠం ఎక్కడం బాబు ఊహకు అందని విషయం. టీడీపీ, కాంగ్రెసు కలిసే జగన్ మీద కోర్టులో కేసులు వేశాయి. కాని ఆ కథ కంచికి వెళ్లకపోవడంతో బాబు కథ అడ్డం తిరిగింది. అసెంబ్లీలో చంద్రబాబుకు ఇబ్బందిగా ఉందని అర్థమైపోతోంది. 46 ఏళ్ల జగన్ అసెంబ్లీలో బాబుపై చెలరేగిపోతుంటే ఆయనకు అసహనం కట్టలు తెంచుకుంటోంది. అందుకే తరచుగా 'నా అనుభవమంత లేదు నీ వయసు' అని అంటుంటారు. బాబు హయాంలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించి ఆయన్ని జైలుకు పంపుతామని వైకాపా నాయకులు అంటున్నారు. టీడీపీ అనుకూల పత్రికలో ఓసారి ఇదే విషయం ప్రస్తావిస్తూ 'బాబును ఈ వయసులో జగన్ జైలుకు పంపాలనుకుంటున్నారా?' అని రాశారు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. చంద్రబాబు వయసును కూడా గౌరవించకుండా జగన్ ఆయన్ని దుర్భాషలాడటం సమంజసం కాదు. అసెంబ్లీలో బాబును విమర్శిస్తూ 'గాడిదలు కాశారా?' అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బహిరంగ సభల్లో మాట్లాడుతూ బాబును ఉరితీయాలని, నడి బజారులో కాల్చిచంపాలని అన్నారు. ఇంత పరుషంగా మాట్లాడటం జగన్‌కు మంచిది కాదు. పెరుగుతున్న వయసుకు తోడు ఓటమిపాలవడంతో పార్టీని కాపాడుకోవడం బాబుకు సవాలుగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కుమారుడు కేటీఆర్ అండగా ఉన్నాడు. కాని బాబుకు ఆ అదృష్టం ఉన్నట్లు కనిపించడంలేదు. బాబు వారసుడిగా లోకేష్ టీడీపీ నడిపిస్తాడనే నమ్మకం కనబడటంలేదు. వయసు పెరుగుతున్నా బాబు పోరాటం చేయాల్సిందేనా?