టీడీపీ అసంతృప్త నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎంతో కరుణ, ప్రేమను ప్రదర్శించారు. గోరంట్ల అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలియగానే చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. సమాజానికి, పార్టీకి అమూల్యమైన సేవలందించే గోరంట్ల త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయం పార్టీ వర్గాల ద్వారా చంద్రబాబుకు తెలిసింది. వెంటనే గోరంట్లకు చంద్రబాబు ఫోన్ చేశారు. ఎప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆయన్ని అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకునేందుకు రెస్ట్ తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.
తిరిగి ప్రజాక్షేత్రంలోకి త్వరగా రావాలని ఆయన ఆకాంక్షించారని తెలిసింది. ఇటీవల చంద్రబాబు, లోకేశ్‌లకు గోరంట్ల ఇచ్చిన సలహాలు, సూచనలేంటో అందరికీ తెలిసినవే. పార్టీ సమస్యల గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు, లోకేశ్‌లకు అనేక దఫాలు ఫోన్ చేసినా, రిసీవ్ చేసుకోకపోవడంతో మనస్తాపానికి లోనైనట్టు గోరంట్ల మీడియా ముఖంగా విమర్శించిన సంగతి తెలిసిందే.
గౌరవం లేని చోట ఆత్మాభిమానం చంపుకుని ఉండాల్సిన అవసరం లేదని గోరంట్ల ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆయన రాజకీయ అడుగులపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం టీడీపీలో గోరంట్ల వ్యవహారం నివురుగప్పిన నిప్పే!