పెట్రోల్, ఇతర నిత్యావసరాల ధరల పెంపును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా శనివారం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ బాధ్యత. ఆ పని చేసిన టీడీపీని మెచ్చు కోవాలి. శ్రీకాకుళం మొదలుకుని కడప వరకూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి వినూత్న రీతిలో నిరసనలు తెలిపి ప్రజల దృష్టిని ఆకర్షించారు.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించడం ఆ పార్టీ అనుకూల మీడియాలో పతాక శీర్షికన వచ్చింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు కాలువ శ్రీనివాస్, దేవినేని ఉమా, చినరాజప్ప, కొల్లు రవీంద్ర తదితరులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ మరోసారి ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న చంద్రబాబు, టీడీపీ భవిష్యత్ వారసుడిగా ప్రచారంలో ఉన్న లోకేశ్ మాత్రం ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఎక్కడా కనిపించలేదు.
కేవలం ఆందోళనలకు ఆదేశించి, తాము మాత్రం ఇళ్లకే పరిమితం కావడం ఏంటని అబ్బాకొడుకులైన చంద్రబాబు, లోకేశ్‌లపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు… ముందుండి నడిపించాల్సిన చంద్రబాబు, లోకేశ్ ఆ పని చేయకుండా, అంతకంటే వెలగబెట్టే ముఖ్యమైన కార్యక్రమాలు ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. అధికారానికి మాత్రం ముందుంటారని, ఆందోళనల్లో మాత్రం కనిపించరని, ఇదెక్కడి న్యాయమని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
కేవలం సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో కనిపించినంత మాత్రాన అధికారాన్ని దక్కించుకోలేమనే వాస్తవాన్ని గ్రహించాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హితవు చెబుతున్నారు. కనీసం లోకేశైనా పాల్గొనేందుకు వచ్చిన ఇబ్బంది ఏంటని వారు ప్రశ్నిస్తుండడం గమనార్హం.