దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ వార్తలకెక్కారు. తన భర్త వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2న రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుండడంతో మీడియా దృష్టిని ఆకర్షించారు. వైఎస్ విజయమ్మ మొదటి నుంచి రాజకీయాలకు దూరమే. అయితే భర్త మరణానంతరం, అనివార్య పరిస్థి తుల్లో ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.
అనంతరం తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటికెళ్లి సొంత పార్టీ పెట్టుకోవడంతో ఆమె వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిగా నేటికీ కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించడం మినహా ఆమె ఎప్పుడూ ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న దాఖలాలు లేవు.
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి రావాలని…వైఎస్సార్ మంత్రి వర్గంలో పనిచేసిన వారిని, రాజకీయ సహచరులను, శ్రేయోభిలాషులను ఫోన్‌లో విజయమ్మ ఆహ్వానిస్తున్నారు.
విజయమ్మ ఆహ్వానం అందుకున్న వారిలో వైఎస్సార్ ఆత్మగా పేరొందిన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ స్పీకర్ కె.ఆర్ సురేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. విజయమ్మ ఆహ్వానం అందుకుంటున్న నేతల్లో పలువురు ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ తప్పక రాజకీయ చర్చకు దారి తీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.