కుప్పంలో మున్సిపల్ ఎన్నికలు జరగకుండానే చంద్రబాబు ఓటమిని అంగీకరించినట్టైంది. తాను ఎమ్మెల్యేగా నిలిచే సమయంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా రాని చంద్రబాబు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పరువు నిలుపుకునేందుకు రోడ్డెక్కడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీ గెలుపును చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం కుప్పం నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ మట్టికొట్టుకు పోయింది. దీంతో చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే టీడీపీ విశ్వాసం కోల్పోయిందనే ప్రచారాన్ని వైసీపీ బలంగా తీసుకెళ్లింది. ఇది టీడీపీకి ఎంతో డ్యామేజీ కలిగించింది.
దీంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. స్థానిక సంస్థల్లో ఓటిమిని పునరావృతం కానివ్వకూడదనే పట్టుదలతో ఆయన కుప్పం పర్యటనకు వెళ్లారు. కుప్పంలో రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ …
‘కుప్పం అభివృద్ధికి గడిచిన రెండున్నరేళ్ళలో తట్ట మట్టైనా వేయని వైసీపీకి ఇక్కడ ఓటడిగే అర్హతే లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. నా హయాంలో పన్నుల భారం ఉంటుందనే కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయలేదు. కొంతమంది పుడింగులు డబ్బు సంచులతో వస్తారు. వైసీపీ వాళ్లు ఓటుకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఆశ చూపిస్తారు. వారి ప్రలోభాలకు లొంగుతారా?. మన కుప్పం పౌరుషం ఏంటో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చూపించండి. 25 వార్డులోను మనమే గెలిచి చూపించాలి ’ అని పిలుపునిచ్చారు.
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఉద్దేశం ఏంటో ఈ మాటలే చెబుతాయి. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇవాళ ఒక మున్సిపాలిటీ కోసం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తానొక జాతీయస్థాయి నాయకుడినంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబును కుప్పం మున్సిపాలిటీ పరిమితం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకనే ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు విజయం సాధించినట్టా? ఓడిపోయినట్టా? …ఈ ప్రశ్నకు టీడీపీ శ్రేణులే సమాధానం చెప్పాలి.