వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో బీజేపీ ఏజెంట్లగా టీడీపీ గ్రామస్థాయి నాయకులు కూచున్నారు. దీంతో బద్వేల్ ఉప ఎన్నిక బరిలో లేని టీడీపీ ఎత్తుగడకు వైసీపీ లబోదిబోమంటోంది. బద్వేల్ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి టీడీపీ పోటీలో లేకపోవడంతో వైసీపీ రిలాక్ష్ అయ్యింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు అంత సీన్ లేకపోవడంతో, వాళ్ల పోటీని వైసీపీ లైట్ తీసుకుంది.
కానీ గత కొన్ని రోజులుగా బీజేపీ ముఖ్యనాయకులు బద్వేల్ నియోజకవర్గంలో తిష్టవేసి పన్నిన వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది. టీడీపీ గ్రామస్థాయి నాయకులను ఎన్నికల్లో తమ తరపున ఏజెంట్లగా కూచునేందుకు ఒప్పించింది. ఇది బీజేపీ సాధించిన విజయం.
కాంగ్రెస్, బీజేపీలకు ఏజెంట్లే ఉండరని భావించిన వైసీపీ నేతలకు తెల్లారి ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే తత్వం బోధపడింది. బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ప్రతిచోట బీజేపీ తరపున టీడీపీ నేతలు ఏజెంట్లగా కూచోవడంతో వైసీపీ తీవ్ర విమర్శలకు దిగింది.
మాజీ ఎమ్మెల్సీ, బద్వేల్ వైసీపీ ఇన్‌చార్జ్ డీసీ గోవిందురెడ్డి మీడియాతో మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యే ఆకస్మిక మృతి చెందితే, వారి కుటుంబంపై గౌరవడంతో పోటీ పెట్టడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారన్నారు. కానీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ఏజెంట్లగా కూచోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు.
ఇది ముమ్మాటికీ దళితులను వంచించడమే అని గోవిందురెడ్డి విమర్శించారు. టీడీపీకి దళితులు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించడం గమనార్హం. బీజేపీకి దగ్గరవడానికి బద్వేల్ ఎన్నికలను టీడీపీ వాడుకుంటోందని విమర్శలకు తాజా పరిణామాలు బలం కలిగిస్తున్నాయి.